చేనేత కార్మికుల మేలు కోసం తెలంగాణ ప్రభుత్వం బృహత్తర పథకాన్ని తీసుకువస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత కార్మికులను ఓనర్లను చేసే ఉద్దేశంతో 'వర్కర్ టూ ఓనర్' పథకాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పారు. సిరిసిల్ల జిల్లాలోని పెద్దూర్‌లో గోకులాస్ ఇమేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అపేరల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల కోసం చేనేత, జౌళి శాఖ తెలంగాణలో అమలు చేస్తున్న పథకాల గురించి మంత్రి కేటీఆర్ వివరించారు.
ఈ 60 ఎకరాల్లో రాబోయే రోజుల్లో రెండు, మూడు ఫ్యాక్టరీలు వరుసగా రాబోతున్నాయి. రాబోయే 6 నెలల్లో గోకల్‌దాస్ కంపెనీ ప్రారంభం కాబోతుంది అని కేటీఆర్ తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అత్యధికంగా మహిళలకే ప్రాధాన్యం ఉంటుంది.
రైతు ఆత్మహత్యలు మన దగ్గరే తక్కువ
"దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యలు తెలంగాణలోనే తక్కువని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. గతంలో వారానికి 10 మంది రైతులు ప్రాణాలు తీసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు చాలా మెరుగు పడింది. భవిష్యత్తులో ఈ పరిస్థితి ఇంకా మెరుగు పడాల్సి ఉంది."
- కేటీఆర్, తెలంగాణ మంత్రి
వర్కర్‌ను ఓనర్ చేసేందుకే..
"వర్కర్ టూ ఓనర్ పథకంలో భాగంగా రూ.400 కోట్లకు పైగా ఖర్చు పెట్టి షెడ్ల నిర్మాణం చేస్తున్నాం. సిరిసిల్లకు 80 కిలోమీటర్ల దూరంలోనే వాటి నిర్మాణం జరుగుతోంది. కార్మికులని ఓనర్ చేసే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అంతేకాక, కష్టపడి పని చేసేందుకు ఇక్కడి మహిళలు ముందుకొస్తే వారికి తగిన నైపుణ్య శిక్షణ ఇచ్చి నెలకు రూ.12 వేలకు తగ్గకుండా జీతం ఇస్తాం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. సిరిసిల్ల అపేరల్ పార్కుకు ఇప్పుడు శంకుస్థాపన జరిగింది. ఈ ప్రదేశంలో భవిష్యత్తులో 10 వేల ఉద్యోగాలు సృష్టించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఔత్సాహికులైన మహిళలు ముందుకు రావాలి." అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా జిల్లా అధికారులను కేటీఆర్ ఆదేశించారు.