KTR On PM Modi: తెలంగాణ పన్నులతోనే కేంద్ర ప్రభుత్వం పాల సాగిస్తోందని.. కాదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ తెలిపారు. మూడేళ్ల క్రితం హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా శానంపూడి సైదిరెడ్డి ఘన విజయం సాధించారని చెప్పారు. టీఆర్ఎస్ గెలిచిన తర్వాతనే హుజూర్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రారంభమైందన్నారు. అనేక సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన నేతలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని చెప్పారు. త్వరలో ఈఎస్ఐ ఆస్పత్రి పూర్తిస్థా యిలో అందుబాటులోకి వస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆసుపత్రిని కార్మిక శాఖ మంత్రి త్వరలో ప్రారంభిస్తారన్నారు. అడిషనల్ సెషన్స్ డిస్ట్రిక్ కోర్టును త్వరలో న్యాయశాఖ మంత్రి హుజూర్ నగర్ లో ప్రారంభిస్తారని చెప్పారు. అలాగే బంజారా భవన్ ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను త్వరలో పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. 


లిఫ్టులన్నింటినీ వినియోగంలోకి తీసుకువస్తామని సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత టిఆర్ఎస్ పార్టీదేనని మంత్రి కేటీఆర్ వివరించారు. భారతదేశాన్ని పరిపాలించిన ఏ ప్రధానికి రాని ఆలోచన, రాష్ట్రాలను పరిపాలించిన ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన సీఎం కేసీఆర్ కు వచ్చిందన్నారు. ఆ ఆలోచన ఫలితమే రైతుబంధు పథకమని చెప్పారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నా 24 గంటల విద్యుత్తు ఇవ్వలేని ప్రధాని దేశంలో ఉన్నారన్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టులో ఉండే ప్రతి రైతుకు కెసిఆర్, టీఆర్ఎస్ పాలన భరోసా ను ఇచ్చిందన్నారు. హుజూర్ నగర్, నేరేడుచర్ల, మున్సిపాలిటీలకు.. మండలాల అభివృద్ధికి మూడు వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే తన ముందు ఉంచిన ప్రతిపాదనలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే అవకాశం ఉంటే ఎద్దుల పందేలా జాతరకు వస్తానని హమీ ఇచ్చారు. 


టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం ఆలోచన చేస్తుంటే... జాతీయ పార్టీలు రెండూ అబద్ధాలు, తప్పుడు ప్రచారాలతో ప్రజల వద్దకు వస్తున్నాయన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో మూడు లక్షల 68 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి చెల్లించామని చెప్పుకొచ్చారు. అందులో లక్షా 68 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం ఇచ్చిందన్నారు. కేంద్ర మంత్రికి మిగిలిన ఎంపీలకు కేసీఆర్ పై విమర్శలు చేయడం తప్ప ఇంకో పని లేదన్నారు. కనీస పరిజ్ఞానం లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. నేను చెప్పేది తప్పైతే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. మీరు చెప్పేది తప్పైతే కేంద్ర మంత్రి పదవి వదిలి పెట్టకపోయినా.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సూచించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం.. కేంద్రం కంటే భారీగా పెరిగిందన్నారు. 


14 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే ప్రధానిగా మోడీ చేసిన అప్పు చాలా ఎక్కువ అని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పులు చేసిందని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆ అప్పు భవిష్యత్తు మీద పెట్టుబడి మాత్రమేనన్నారు. ఆ పెట్టుబడి ద్వారా సంపాదన సృష్టించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. మోదీ పాలనలో దేశాన్ని దోచుకున్న వాళ్లు మాత్రమే బాగుపడ్డారని వివరించారు. టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారినా జెండా, ఎజెండా, మనుషులు, డీఎన్ఏ మాత్రం మారలేదు. వర్గాల ప్రజలు, ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగానే బీఆర్ఎస్ పార్టీ ముందుకు  సాగుతుందని తెలిపారు.