Sajjala On Chandrababu : చంద్రబాబు ఒక ఉన్మాదిలా  రొమ్ము విరుచుకొని కుప్పంలో వీరంగం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జీవో నెం 1 అవసరమా లేదా ప్రజలను అడుగుతున్నామన్నారు. ప్రజల ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. విజయవాడలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన...చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా రోడ్లపై సభలు, రోడ్ షో పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. పోలీస్‌ యాక్ట్‌కు లోబడి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం 1 ను తీసుకువచ్చిందన్నారు. ఇటీవల చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటకు ఆయనే బాధ్యత వహించాలన్నారు.  వారం రోజులుగా చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నిబంధనలు పాటించి ఉంటే అమాయకులు చనిపోయేవారు కాదన్నారు. చంద్రబాబు సభలను పోలీసులు అడ్డుకోలేదన్నారు. ఏం చేస్తారో చేసుకోమని చందబ్రాబు విచ్చలవిడిగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. 


చంద్రబాబు హైడ్రామా 


"పోలీస్ యాక్టు మేరకు ప్రజా భద్రత కోసం ప్రభుత్వం ఓ జీవో తీసుకువచ్చింది. రోడ్డపై సభలు, రోడ్ షోలతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అలాంటి వాటిని తగ్గించేందుకు ఈ జీవో తెచ్చాం. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను మేం పాటించడం ఏంటని టీడీపీ ఛాలెంజ్ చేసింది. ఈ జీవోను ఎలాగైనా ఉల్లంఘిస్తామని చెప్పింది. పోలీసులు ఏంచేస్తారో అని కుప్పం మీదకు చంద్రబాబు దండయాత్రకు వెళ్లారు. వారం రోజులుగా చంద్రబాబు హైడ్రామా చేస్తున్నారు. జరిగిన మారణకాండకు బాధ్యత వహించాల్సింది పోయి ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారు. వ్యవస్థలన్నింటినీ కాలి కింద వేసి తొక్కేస్తానని, రొమ్ము విరుచుకుని చంద్రబాబు కుప్పం వీధుల్లో వీరంగం సృష్టిస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా అనుభవాల బట్టి జీవోలు తీసుకువస్తుంది. ఈ జీవో అవసరమా లేదో ప్రజలు చెప్పాలి. చైతన్య రథాన్ని ఇచ్చేయాలని చంద్రబాబు కుప్పం వీధుల్లో నిరసన చేస్తున్నారు." -సజ్జల


పోలీసులకు బెదిరింపులు 


చీకటి జీవో అంటూ ప్రతిపక్షాలు నానాయాగి చేస్తున్నాయి. కందుకూరు ఘటనలో 8 మంది ప్రాణాలను తీసేశారు. చంద్రబాబు ఇరుకు సంధుల్లో మీటింగ్ పెట్టి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. వివేకం ఉన్న వాళ్లు మంచి జీవో తీసుకొచ్చారని చెప్తున్నారు. మేం కూడా ఈ జీవోకు కట్టుబడిఉన్నాం. పోలీస్ యాక్టు సెక్షన్ 30 ప్రకారం ఆంక్షలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఎక్కడ సభలు పెడుతున్నారో చెబితే పర్మిషన్ ఇస్తామని పోలీసులు చెప్పారు. దానికి టీడీపీ వాళ్లు సమాధానం ఇవ్వలేదు. ప్రతిపక్షనాయకుడు అనే గౌరవంతో పోలీసులు ఎంతో ఓపికగా మాట్లాడారు. కానీ చంద్రబాబు పోలీసులను బెదిరిస్తున్నారు. ఎక్కడైనా కూర్చొని నిరసన చేస్తానంటూ చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు ఏమైనా చేయగలరు. రాజకీయ నటుడు చంద్రబాబు. తన వెనుకున్న వాళ్లనూ అలానే తయారుచేశారు. అవసరమైతే చొక్కా చించుకుని నాటకాలు ఆడగలరు " - సజ్జల