Video KYC for NPS Death Claim: పదవీ విరమణ తర్వాత ప్రజలకు డబ్బు కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఒకటి. ఇది ఒక పదవీ విరమణ ప్రయోజన పింఛను పథకం (Retirement Pension Scheme). నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో మీరు ప్రతి నెలా జమ చేసే పెట్టుబడి వల్ల, ఉద్యోగ విరమణ తర్వాత ప్రతి నెలా పెన్షన్ పొందవచ్చు. దీంతో పాటు, మీరు పెట్టిన డబ్బును మీ రిటైర్‌మెంట్‌ తర్వాత పెద్ద మొత్తంలో ఒకేసారి అందుకోవచ్చు. 


తాజాగా, ఈ పథకం కింద, 'పింఛను నిధి నియంత్రణ & అభివృద్ధి ప్రాధికార సంస్థ' (Pension Fund Regulatory and Development Authority - PFRDA), చందాదార్ల కోసం ఒక పెద్ద ఊరట ప్రకటించింది.


NPSలో పెట్టుబడి పెడుతున్న సమయంలో చందాదారు ఏదైనా కారణం వల్ల మరణిస్తే, NPS క్లెయిమ్‌ కోసం అతని కుటుంబ సభ్యులు ఇకపై ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా ఒక సౌకర్యాన్ని PFRDA ప్రకటించింది. ఈ విషయం మీద ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. దురదృష్టవశాత్తు NPS ఖాతాదారు మరణించిన సందర్భంలో, అతని నామినీ, హక్కుదారు లేదా వారసుల్లో ఒకరు వీడియో కేవైసీ (Video KYC) ధృవీకరణ ద్వారా NPSని క్లెయిమ్ చేయవచ్చు. ఇది సురక్షితమైన ఆప్షన్‌. ఇంట్లో కూర్చొనే, సాంకేతికత సహాయంతో వీడియో KYC ధృవీకరణ పని పూర్తి చేయవచ్చు.


వీడియో KYC ధృవీకరణ సౌకర్యాన్ని జనవరి 4, 2023 నుంచి PFRDA ప్రకటించింది. కుటుంబ సభ్యుడు చనిపోయి దుఃఖంలో ఉన్న నామినీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, NPS ఉపసంహరణ కోసం సులభంగా క్లెయిమ్ చేసుకోగలిగేలా, ఈ విధానాన్ని అమలు చేయాలని PFRDA నిర్ణయించింది. అక్టోబర్ 6, 2020 నాటి సర్క్యులర్ ద్వారా.. ఆన్‌బోర్డింగ్, ఎగ్జిట్‌ సహా NPS సంబంధిత ఏ విధమైన సేవల కోసమైనా వీడియో ఆధారిత కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్‌ను (VCIP) ఉపయోగించడానికి కూడా PFRDA అనుమతించింది.


కొత్త ఆప్షన్‌ ఎలా పని చేస్తుంది?
వీడియో కేవైసీ ద్వారా డెత్ క్లెయిమ్ ఎలా చేయవచ్చు అన్న సమాచారాన్ని తన నోటిఫికేషన్‌లో PFRDA వివరించింది. వీడియో కేవైసీ సమయంలో, కెయిమ్‌కు సంబంధించిన పత్రాలను నామినీ లేదా హక్కుదారు లేదా వారసుడు సమర్పించాల్సి ఉంటుంది. ఆ పత్రాలు చందాదారుకు, నామినీ లేదా హక్కుదారు లేదా వారసుడికి చెందినవై ఉండాలి. ఈ-KYC, డిజీలాకర్ ఉపయోగించి ఆధార్‌ను ధృవీకరించవచ్చు. దీంతో పాటు, నామినీ లేదా హక్కుదారు లేదా వారసుడు తన బ్యాంక్ వివరాలను కూడా ఇవ్వాలి. వీడియో KYC విధానంలో నామినీ పత్రాలను సమర్పించిన తర్వాత, సంబంధిత అధికారులు వాటిని తనిఖీ చేసి ధృవీకరించుకుంటారు. ఈ ధృవీకరణ తర్వాత డెత్ క్లెయిమ్ తదుపరి ప్రక్రియ పూర్తవుతుంది.


ఏయే పత్రాలు అవసరం?
NPS డెత్ క్లెయిమ్ చేయడానికి, తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన పత్రాలను కలిగి ఉండాలి. వాటిలో, చందాదారు మరణ ధృవీకరణ పత్రం, చందాదారు ఆధార్ కార్డ్, నామినీ లేదా హక్కుదారు లేదా వారసుడి ఆధార్ కార్డ్, వారసత్వ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలి.