తెలంగాణలో కురుస్తున్న అకాల భారీ వర్షాల వల్ల రైతులకు అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ భరోసా కల్పించారు. ఈ సమయంలో వర్ష ప్రభావిత ప్రాంతంలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ రైతులకు భరోసా ఇవ్వాలని సూచించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులంతా క్షేత్ర స్థాయిలో పర్యటించి స్ధానిక అధికారులతో సమన్వయం చేసుకోవాలని, పరిస్థితులను పర్యవేక్షించాలని కోరారు. రాష్ట్రంలోని రైతులు ఆందోళన చెందవద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.


నిన్న (ఏప్రిల్ 25) సాయంత్రం నుంచి కురుస్తున్న అకాల వర్షాలపై మంత్రి కేటీఆర్‌ తన సొంత నియోజకవర్గం అయిన సిరిసిల్ల జిల్లా అధికారులతో సమీక్ష చేశారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌తోపాటు జిల్లా ఎస్పీ, వ్యవసాయ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాలోని పరిస్థితుల గురించి వివరాలు తీసుకున్నారు. ఈ అకాల వర్షాల వలన నష్టపోయిన జిల్లా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. రైతులు అందోళన చెందవద్దని కోరారు. జిల్లా అధికారులతోపాటు జెడ్పీడీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు ప్రతి ఒక్కరు తమ పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించి రైతులకు అండగా ఉండాలని సూచించారు.


మంత్రి హరీశ్ రావు కూడా భరోసా


తెలంగాణలో గత రాత్రి (ఏప్రిల్ 25) కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులు, వడగళ్ల వల్ల కొన్ని ప్రాంతాల్లో రైతులు భారీ ఎత్తున పంటలు నష్టపోయిన సంగతి తెలిసిందే. పంట చేతికి వచ్చి రేపో మాపో అమ్మకానికి పెడదామని ఆశతో ఉన్న రైతులు నీటిపాలైన ధాన్యం చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. అయితే, వారికి భరోసా ఇచ్చేలా ఆర్థిక మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. నోటికాడి బుక్క జారిపోయిందని ఎంతో బాధతో ఉన్న రైతులను ఓదార్చడానికి సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి హరీశ్ రావు తన నియోజకవర్గంలో పర్యటించారు. గ్రామాలలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నామని హరీశ్ రావు చెప్పారు.


మంత్రి హరీశ్ రావు పంట నష్టంపై స్పందిస్తూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రూ.10 వేలు నష్ట పరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని హరీశ్ రావు అన్నారు. రైతులను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్య పడొద్దని అభయం ఇచ్చారు. దేశంలో ఎక్కడా రెండు, మూడు వేలకంటే ఎక్కువ ఇవ్వడం లేదని అన్నారు. రైతులకు ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నామని హరీశ్ రావు అన్నారు. ఒక్క తెలంగాణలోనే వేల కోట్లు ఖర్చు పెట్టి నాణ్యమైన విద్యుత్ ను రైతులకు అందించామని చెప్పుకొచ్చారు. ఒక్క సిద్దిపేటలోనే మొదటి దశలో 35 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు చెప్పారు. నిన్నటి వానతో నష్టం ఎంత అనే వివరాలు రావాల్సి ఉందని, దానిపై అంచనా వేస్తున్నామని చెప్పారు. 


రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్‌లోనే వరి నాట్లు వేయడం వల్ల, కోతలు పూర్తి చేసి కొంత మంది నష్టం నుంచి బయట పడ్డారని అన్నారు. ఇక నుంచి రైతులు కూడా ఒక నెల ముందుగా నాట్లు వేసుకుంటే వడగళ్ల బాధ నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. భవిష్యత్తులో ఒక నెల ముందుకు సీజన్ తెచ్చేలా రైతులకు అవగాహన కల్పిస్తామని మంత్రి హరీశ్ రావు సూచించారు.