Minister KTR: అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను కలుస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సౌకర్యాలు. రాష్ట్ర ప్రభుత్వం అందించే రాయితీలు, ఇతర అంశాలను వివరిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ ఏయే అంశాల్లో ఉత్తమంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ఇచ్చే రాయితీలు, టీఎస్ బీపాస్ లాంటి విధానాల గురించి చెబుతూ ఇప్పటికే పలు కంపెనీలతో ఒప్పందాలు పూర్తి చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రం ఏవిధంగా మారిందో వివరించనున్న కేటీఆర్
ఈ నెల 16న తేదీన మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్(ఏఎస్సీఈ) ఆధ్వర్యంలో నెవడా రాష్ట్రంలోని హెండర్సన్ లో ఈ నెల 21 నుండి 25 వరకు జరగనున్న వరల్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ లో కేటీఆర్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. నీటి వనరుల నిర్వహణ, ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రం ఏ విధంగా మారిందో కేటీఆర్ వివరించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కార్యక్రమాలతో తెలంగాణలో సాధించిన విజయాలపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. గత ఐదు రోజులుగా న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, హ్యూస్టన్ తదితర నగరాల్లో కేటీఆర్ బృందం పర్యటించింది. ఇప్పటికే అనేక దిగ్గజ కంపెనీలు తమ పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హైదరాబాద్ లో తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వైద్య పరికరాల ఉత్పత్తి, హెల్త్ కేర్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెడ్ ట్రానిక్స్ కూడా రాష్ట్రంలో రూ.3 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.
వాషింగ్టన్ డీసీలో 30కిపైగా ఐటీ కంపెనీల యాజమాన్యాలతో సమావేశం
మాండీ హోల్డింగ్స్ తెలంగాణలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే గ్లోబల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని కలిగి ఉన్న స్టోరబుల్ కంపెనీ మరిన్ని విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. వరంగల్ లో ఒక డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రైట్ సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రకటించింది. వాషింగ్టన్ డీసీలో 30కి పైగా ఐటీ కంపెనీల యాజమాన్యాలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సదర్భంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో కంపెనీల కార్యాలయాల ఏర్పాటుకు కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. జాప్‌కామ్ గ్రూప్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. జెనెసిస్ 50-60 మిలియన్ డాలర్లతో విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఆరోన్ క్యాపిటల్ ఛైర్మన్ డేవిడ్ వోల్ఫ్ తో సమావేశం
బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్ ఈవీపీ చీఫ్ డిజిటల్, టెక్నాలజీ అధికారి గ్రెగ్ మేయర్స్ బృందంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. వింగ్సూర్-ఇన్‌సర్‌టెక్ కంపెనీ వ్యవస్థాపకుడు అవిబసు, ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ ఆరోన్ క్యాపిటల్ ఛైర్మన్ డేవిడ్ వోల్ఫ్ సహా తదితర ప్రముఖులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. సాఫ్ట్‌వేర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ తో పాటు ప్రిసిషన్ ఇంజినీరింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని హైదరాబాద్ లో ప్రారంభించడానికి టెక్నిప్ ఎఫ్ఎంసీ ముందుకొచ్చింది.