Minister KTR: నిన్న పలివెలలో బీజేపీ నేతల రాళ్ల దాడిలో గాయపడిన మునుగు జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్ ను మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ పరామర్శించారు. హింస‌కు పాల్ప‌డాలనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని తిప్పికొట్టే శ‌క్తి, స‌త్తా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. కానీ మ‌ధ్య‌లో నలిగిపోయేది సామాన్యులని వివరించారు. భౌతిక దాడులు సరికాదన్నారు. హింస దేనికి ప‌రిష్కారం కాదని సూచించారు. చిల్ల‌ర ప‌నులు, మాట‌లు, ప్ర‌చారాలు ఇక ఆపేయమని చెప్పారు. చిల్ల‌ర మాట‌ల‌తో తెలంగాణ‌లో అగ్గిపెట్టే ప్ర‌య‌త్నం చేస్తే.. బుద్ధి చెప్పే స‌త్తా టీఆర్ఎస్ కు, ప్ర‌జ‌ల‌కు కూడా ఉంది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. మునుగోడులో ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని తెలిసే అమిత్ షా మీటింగ్ ర‌ద్దు చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అందుకే జేపీ న‌డ్డా కూడా రాలేదన్నారు. 




ఎలాగూ గెలవమని.. దాడుల‌కు పాల్ప‌డుతున్నని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బెంగాల్‌లో మీ వ‌ల్లే హింస ప్రారంభ‌మైందంటూ ధ్వజమెత్తారు. శ‌వాల మీద పేలాలు ఏరుకునే దౌర్బాగ్య సంస్కృతి బీజేపీ పార్టీదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ రాజ‌కీయం బీజేపీకే  మాత్రమే సాధ్య‌ం అవుతుందంటూ ఎద్దేవా చేశారు. నిన్న ప‌లివెల‌లో 12 మంది టీఆర్ఎస్ నాయ‌కుల‌ను గాయ‌ప‌రిచారని తెలిపారు. ఇదే సంస్కృతిని కొన‌సాగిస్తే మేం తిర‌గ‌బ‌డ‌క త‌ప్ప‌దని హెచ్చరించారు. సానుభూతి నాట‌కాలు మంచిది కాదు అని కేటీఆర్ హెచ్చ‌రించారు.


గ‌త 8 ఏళ్లలో ఉద్రిక్త‌త‌కు తావు ఇవ్వ‌లేదు..


2001 నుంచి 2014 వ‌ర‌కు 14 ఏండ్ల పాటు ఎన్నో భావోద్వేగాల మ‌ధ్య‌న‌, ఎన్నో ర‌కాల ఒత్తిళ్ల మ‌ధ్య తెలంగాణ ఉద్య‌మాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లామ‌ని కేటీఆర్ గుర్తు చేశారు. ఒక్క చుక్క ర‌క్తం కూడా చిందించ‌కుండా, ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తుల్లోనే తెలంగాణ సాధించాల‌నే నిబద్ధ‌త‌తో, చిత్త‌శుద్ధితో అన్ని ర‌కాల అవ‌రోధాల‌ను త‌ట్టుకోని తెలంగాణను సాధించామన్నారు. ఆ ఉద్య‌మానికి కేసీఆర్ నాయ‌క‌త్వం వ‌హించారని మంత్రి గుర్తు చేశారు. ఎన్న‌డూ కూడా కొట్లాట‌లు, హింస‌ల‌కు తావు ఇవ్వ‌లేదు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వ‌చ్చిన త‌ర్వాత గ‌త 8 ఏళ్లకే ఎక్క‌డ ఎన్నిక జ‌రిగినా కూడా ఉద్రిక్త‌త‌కు తావు ఇవ్వ‌లేదని కేటీఆర్ తెలిపారు.




రెచ్చ‌గొట్టే మాట‌లు మాట్లాడితే స‌హించం..


బీజేపీ నాయ‌కులు వారి ఆగ‌డాలు, ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం హింస‌ను రెచ్చ‌గొట్టారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. శాంతి, భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌ల‌ను సృష్టించాల‌నే వ్యూహంతో దానికి అనుగుణంగానే నిన్న ప‌లివెల‌లో పెద్ద ఎత్తున రాజేంద‌ర్ నాయ‌క‌త్వంలో బీజేపీ కార్య‌క‌ర్త‌లు దాడుల‌కు దిగారన్నారు. ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, ములుగు జ‌డ్పీ చైర్మ‌న్ కుసుమ జ‌గ‌దీశ్ తో పాటు 12 మంది కార్య‌క‌ర్త‌ల త‌ల‌లు ప‌గల గొట్టారని వివరించారు. క‌ర్ర‌ల‌తో దాడి చేశారని చెప్పుకొచ్చారు. మొత్తం ఫోటోలు, వీడియోలు ఉన్నాయని తెలిపారు. ఎవ‌రు ఎవ‌రి మీద దాడి చేశార‌నే ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఈటల రాజేంద‌ర్ పీఏ న‌రేశ్ అనే వ్య‌క్తి రాళ్ల‌తో దాడి చేసిన ఫోటోలు ఉన్నాయని స్పష్టం చేశారు. మా ప్ర‌చారం మేం చేసుకుంటుంటే మాపై దాడి చేసి, సానుభూతి కోసం నాట‌కాలు ఆడుతున్నారని ఆరోపించారు. మీరు పిడికెడంత మంది మాత్రమే ఉన్నారని... మాకు 60 ల‌క్ష‌ల మంది కార్య‌క‌ర్తులు ఉన్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. రెచ్చ‌గొట్టే మాట‌లు మాట్లాడితే.. స‌హించం అని కేటీఆర్ తేల్చిచెప్పారు.