జేమ్స్ కేమరూన్ 'అవతార్ - ది వే ఆఫ్ వాటర్' (Avatar -The Way of Water) కొత్త ట్రైలర్ వచ్చేసింది. పార్ట్ 2 సినిమా విడుదలకు కేమరూన్ వదిలిన రెండో ట్రైలర్ ఇది. మొదటి ట్రైలర్ లో చూపించిన సీన్స్ కు భిన్నంగా అద్భుతమైన పండోరా గ్రహాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు జేమ్స్ కేమరూన్. డిసెంబర్ 16 న థియేటర్లలో ఈ సినిమా విడుదల కోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు తీయని బహుమతిని అందించాడు. సరే కాసేపు అవతార్ 2 ట్రైలర్ పక్కనపెడితే...అసలు ఎందుకీ సినిమాను జేమ్స్ కేమరూన్ ఇంత కష్టపడి...ఇష్టపడి తీస్తున్నారు. ఎప్పుడో 2009 లో పార్ట్ 1 ను వదిలి మళ్లీ 13 ఏళ్ల తర్వాత పార్ట్ 2 రిలీజ్ చేస్తున్న ఆయన తపనను ఎలా అర్థం చేసుకోవాలి. అసలు ఓ దర్శకుడు తన కెరీర్ లో 13 ఏళ్ల పాటు ఓ సీక్వెల్ సినిమా మీద పని చేయటమన్న ఊహే అద్భుతంగా ఉంది. మరి కేమరూన్ ఈ సొసైటికి ఇస్తున్న సందేశమేంటీ..?
నీ కథ నీకే చెబుతున్న కేమరూన్!
అసలు మనం ఎవరం..? ఎక్కడి నుంచి ఈ భూమి మీదకు వచ్చాం..అంతా మిస్టరీ. హ్యూమన్ ఎవల్యూషన్ థియరీలు, దేవుడు సృష్టించిన పిల్లలు లాంటి కాన్సెప్టులను దాటి ఆలోచిస్తే...మానవ నాగరికత అంచలంచెలుగా ఎదిగిన తీరు అద్భుతం..అమోఘం. ప్రకృతి వనరులతో తనను తాను శక్తిమంతుడిగా మార్చుకున్న మనిషి ఇప్పుడు ఈ పుడమిని దాటి అంతరిక్షంలో ఆధిపత్యం కోసం ఎదురు చూస్తున్నాడు. మరి మనం నడుస్తున్న ప్రయాణం సరైనదేనా...? అనుకున్న లక్ష్యం దిశగా సాగుతున్న తోవలో మనం తొక్కేస్తున్న విలువలు ఏమైనా ఉన్నాయా..? ఆలోచించుకో అంటూ మానవజాతిపై కేమరూన్ అనే దిగ్గజ దర్శకుడు వదిలిన ప్రశ్నల వర్షమే అవతార్ సిరీస్. పార్ట్ 1 కానీయండి పార్ట్ 2 అవనీయండి కేమరూన్ నీకు చెబుతున్నది నీ కథే.
బాధ్యత మరిచిపోకూడదనే సందేశం!
మనిషిగా మన కర్తవ్యం ఏంటీ...మనం బతుకుతున్న ఈ అందమైన ప్రపంచాన్ని ఇంతే అందంగా కాపాడుకుంటూ భావి తరాలకు అతి జాగ్రత్తగా అప్పగించటమే కదా. మరి ఆ పనిని మనం ఎంత బాధ్యతగా చేస్తున్నాం ఇదే కేమరూన్ ప్రశ్న. నేరుగా అడిగితే మనం సమాధానం చెప్పం కనుక...భూమి లాంటి వాతావరణాన్ని పోలిన పండోరా గ్రహాన్ని సృష్టించాడు. మనిషిని పోలిన నావి జాతిని పుట్టించాడు. మన భూమి మీద లానే అక్కడ భారీ తిమింగలాలు ఉన్నాయి...అల్లంత ఎత్తునుంచి జారిపడే జలపాతాలు ఉన్నాయి. మహాసముద్రాలు, గగనతలంలో జోరున ఎగిరే పక్షులు ఉన్నాయి. డైనోసార్లను పోలిన ప్రాణులు, మొక్కలను పోలిన మొక్కలు ఇలా ప్రతీది భూమికి అచ్చమైన ప్రతిబింబమే పండోరా. సరిగ్గా అక్కడే మనిషినీ ఓ స్వార్థపూరిత శక్తిలా నిలబెట్టాడు కేమరూన్ . తన ఉన్నతి కోసం ఏ గ్రహవాసులనైనా పీడించే తత్వం ఉన్న ప్రతి నాయకుడిలా సాటి మనిషి ప్రవర్తించే తీరు నచ్చకనే మనం కూడా అవతార్ చూస్తున్నంత సేపు ఆ ఆటవిక జాతివైపే నిలబడతాం. ఫలితంగా మనం మన భూమిపై ఉన్న సహజ సంపదలను నాశనం చేస్తూ ఓ మనిషిగా మనం ఎంత తప్పు చేస్తున్నామో ఆలోచించేలా చేయటమే కేమరూన్ సంకల్పం.
మార్పు సాధ్యమా!
కచ్చితంగా సాధ్యమే. ఏదో సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. మారుతున్న కాలంతో పాటు మనమూ మారవలే లేనిచో ఏమారేదము అని. అది అక్షర సత్యం. భూతాపం నానాటికి పెరిగిపోతోంది. ఇష్టానుసారం అడవులను నరికేస్తున్నాం. ప్రగతి మాటున జరుగుతున్న మారణం హోమం చాలానే ఉంది. ఎన్నో జీవ జాతులు అంతరించిపోతున్నాయి. ఈ సృష్టిలో ప్రాణులన్నింటికీ మనిషిలానే భూమిపై స్వేచ్ఛగా హక్కు ఉంది. దాన్ని కాలరాసేందుకు మనకు ఎలాంటి అర్హతా లేదు. కాదని స్వార్థం మనిషిలో నిలువెల్లా పెరిగిపోయిన రోజున... తిరగబడిన 'నావి' జాతిలా మనిషిని సైతం తుదముట్టించే ఉపద్రవం ఏదో ఒక రూపంలో ముంచుకు వస్తుంది. అది ప్రకృతి ప్రకోపం కావచ్చు....మరేదైనా రూపంలో రావచ్చు. ఆ ప్రమాదాన్ని కళ్లకు కట్టినట్లు చూపించటమే కేమరూన్ లక్ష్యం. ఆ పనిని సమర్థవంతంగా చేస్తున్నారు కాబట్టే కేమరూన్ కృషికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. అవతార్ చూపిస్తున్న అద్భుతాలకు ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల కలెక్షన్లు కురుస్తున్నాయి.