ఆస్క్ యువర్ కేటీఆర్ కార్యక్రమంలో.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. కేటీఆర్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి కావాలని ఓ నెటిజన్ అడగ్గా..  సొంత రాష్ట్రానికి సేవ చేస్తూ.. సంతోషంగా ఉన్నట్టు కేటీఆర్ వెల్లడించారు. ప్రజలు శాంతి, సుస్థిరత కోరుకుంటున్నారని కేటీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సుపరిపాలన, అభివృద్ధిపై దృష్టి సారిస్తుందని పేర్కొ్న్నారు. ఫైబర్ నెట్ ద్వారా తొలి దశలో 2022 ఏప్రిల్ వరకు తెలంగాణలోని గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో వస్తాయన్నారు. ఓ నెటిజన్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల గురించి అడగ్గా.. యూపీలో ప్రస్తుతం సమాజ్ వాది పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. 


కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారా? అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. భవిష్యత్తులో ఏం రాసిపెట్టి ఉందో ఎవరికి తెలుసునని కేటీఆర్ అన్నారు. ఓ నెటిజన్ ప్రశ్నకు సమాధానంగా.. రేవంత్ లాంటి నేరస్థులు, 420తో చర్చలో పాల్గొనని ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రేవంత్ చర్చించవచ్చని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీకి మద్దతుగా టీఆర్ఎస్ ప్రచారం చేస్తుందా అని ప్రశ్నించగా.. చర్చించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ ఉంటుందా అని అడిగిన నెటిజన్ ప్రశ్నించగా.. కొవిడ్ కేసుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని చెప్పారు. దీనికోసం వైద్యారోగ్య శాఖతో మాట్లాడాలని.. వారి సలహా మేరకు నిర్ణయం ఉంటుందన్నారు.