Minister Harish Rao News: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు కుమారుడు అర్చిష్మాన్ తన్నీరు ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. ఆయన అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ చదివారు. ఆ యూనివర్సిటీ నుంచి తాజాగా ఇంజినీరింగ్ పట్టా అందుకున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు కూడా వెళ్లారు. అమెరికాలోని కొలరాడో కౌంటీ బౌల్డర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు కూడా హాజరై, తన కుమారుడు అర్చిష్మాన్‌ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకోవడాన్ని తిలకించారు. గ్రాడ్యుయేషన్‌తో పాటుగా గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ అవార్డు కూడా అర్చిష్మాన్ అందుకున్నట్లుగా మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేసి తెలిపారు. 


దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కుమారుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి పట్టా అందుకోవడం తనకు ఆనందాన్ని కలిగిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ‘‘మా అబ్బాయి ఆర్చిష్మాన్ సాధించిన ఈ అద్భుతమైన ఘనత పట్ల గర్వించకుండా ఎలా ఉండగలను? ఇది అతనిలోని పట్టుదలకు, లక్ష్యానికి నిదర్శనం. తనలోని ఈ నైపుణ్యం ద్వారా ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి అర్చిష్మాన్ సిద్ధంగా ఉన్నాడు. డియర్ అచ్చూ.. ఈ ఇంక్రీడబుల్ మైల్ స్టోన్‌ను చేరుకున్న సందర్భంగా నీకు అభినందనలు’’ అని కుమారుడిని ఉద్దేశించి హరీశ్ రావు రాసుకొచ్చారు.






మరోవైపు, హరీశ్ రావు సోమవారం (మే 22) హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వైద్యరంగంలో అత్యంత పారదర్శకంగా నియామకాలు జరుగుతున్నాయని హరీష్ రావు తెలిపారు. కొత్తగా ఎంపికైన 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మంత్రి హరీష్ రావు నియామక పత్రాలను అందజేశారు. శిల్పకళా వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైద్య విద్యలో దేశంలోనే ఇది ఒక రికార్డు అని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని అన్నారు. 1931 మంది ఆయుష్ కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించినట్లు స్పష్టం చేశారు. అలాగే ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 22 వేల 263 మందికి ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. మరో 9 వేల 222 పోస్టులకు రెండు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఎవరైనా ప్రమాదాలకు గురైనా, అనారోగ్యానికి గురైనా వారిని కాపాడే శక్తి కేవలం వైద్యులకు మాత్రమే ఉందని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్నారు. వైద్యులు సమాజానికి మంచి సేవలు అందించాలని కోరారు.