తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై అధికార పార్టీ నుంచి విమర్శలు మొదలు అయ్యాయి. ముందు కర్ణాటకలో డిక్లరేషన్ చేసి తర్వాత ఇక్కడ ప్రకటించాలని మంత్రి హరీశ్ రావు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, ఛత్తీస్‌ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని, అక్కడ వెయ్యి మాత్రమే ఇస్తున్నారని గుర్తు చేశారు.


ఈ సందర్భంగా హరీశ్ రావు గతంలో బండి సంజయ్ చేసిన హామీలను ప్రస్తావించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ బండి పోతే బండి ఇస్తామని ఇలాగే చెప్పారని, ఇప్పటికీ బండి లేదు, గుండు లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే డిక్లరేషన్ నమ్మే విధంగా లేదని కొట్టిపారేశారు. ఎన్నికల ముందు ఇలాంటివి కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు వస్తాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి డిక్లరేషన్లు చేయవద్దని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నట్లుగా చెప్పారు. ఒక్కొక్క దివ్యాంగుడు ఒక్కొక్క కేసీఆర్ కావాలని హరీశ్ రావు ఆకాంక్షించారు. గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీలు చేసేవారు ఉన్నా ఎక్కడా కూడా బీడీ కార్మికులకు పింఛను ఇవ్వడమే లేదని అన్నారు. బీడీ కార్మికులకే కాదని.. బీడీ టేకేదార్‌లకు రూ.2016 పింఛను ఇస్తున్నామని హరీశ్ రావు చెప్పారు.


మాయల ఫకీర్లు వస్తుంటారు - సత్యవతి రాథోడ్


దేశంలో ఎస్సీ, ఎస్టీల వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణమని మంత్రి సత్యవతి రాథోడ్ కూడా విమర్శించారు. ‘‘ఏదైనా చేసి అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్ ఆలోచన. తెలంగాణలో చైతన్యవంతులైన ఎస్సీ ఎస్టీలు కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి. ఎస్టీ రిజర్వేషన్ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది తెలంగాణ ప్రభుత్వం. నాలుగు లక్షల ఎకరాలకు పైగా పోడు భూముల పట్టాల పంపిణీ చేశాం. మా గూడెంలో మా రాజ్యం కావాలని గిరిజన బిడ్డలు కోరుకున్నారు. కానీ అసత్య ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది. ఇంకెన్ని రోజులు ఇలాంటి కుట్రలు చేస్తారు. కాంగ్రెస్ 75 ఏళ్లలో సేవలాల్ జయంతి వేడుకలు నిర్వహించారా? కాంగ్రెస్ పార్టీ కి సోయి ఉంటే కర్ణాటకలో ఆదివాసి గిరిజన భవనాలు నిర్మించాలి


ఎన్నికలు వస్తే ఇలాంటి మాయల పకీర్లు అనేకమంది వస్తుంటారు. మనకున్న చైతన్యంతో ఇలాంటి మాయల పకీర్లను తరిమికొట్టాలి. మన మీద పెత్తనం చెలాయించి అధికారం చేసినవాళ్లు ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం తెలంగాణకు వస్తున్నారు. ఇలాంటి కపట ప్రేమ ఉన్న కాంగ్రెస్  రాజకీయ నాయకులను నమ్మొద్దు. కేసీఆర్ ను మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు మేం శాయశక్తుల కృషి చేస్తాం. మాయమాటలు చెబుతున్న కాంగ్రెస్ బీజేపీకి డిపాజిట్ కూడా రాకుండా ఓడించాలి. అందుకే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రేవంత్ రెడ్డి లాంటి వాళ్లను తరిమి కొట్టాలి. ఒక్క రాష్ట్రంలో అధికారం కోసం మల్లికార్జున ఖర్గే  ఇలాంటి ఆరోపణలు అసత్యాలు చేయడం మంచిది కాదు. కాంగ్రెస్ చేస్తున్న ఎస్టీ డిక్లరేషన్ కుట్రపూరితమే’’ అని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.


మద్దతు హరీశ్ రావుకే అంటూ ఏకగ్రీవ తీర్మానాలు


తాము హరీశ్ రావుకే మద్దతు పలుకుతామని, ఆయనకే ఓటేస్తామని సిద్దిపేట జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ముదిరాజ్‌ కుల సంఘాల నేతలు ఆదివారం (ఆగస్టు 27) మంత్రి హరీశ్‌ రావును కలిసి ఏకగ్రీవ తీర్మానాలు అందజేశారు.  మంత్రి హరీశ్‌ రావు వెంటే మేమంతా ఉంటామని చెప్పారు. సిద్దిపేట రూరల్ మండలంలోని చిన్న గుండవెల్లి గ్రామ మత్స్య కారుల సహకార సంఘం, ఇరుకోడ్ గ్రామ హనుమంతు పల్లి ముదిరాజ్ సంఘం, సిద్దిపేట పట్టణంలోని హనుమాన్ నగర్ ముదిరాజ్ సంఘం నేతలు, సభ్యులు మంత్రికి మద్దతు పలికారు.


ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట ప్రజల ఆదరణ, ఆప్యాయత గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసమే పని చేస్తానని అన్నారు. అందరూ ఏకతాటి పైకి వచ్చి ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం పట్ల బీఆర్‌ఎస్‌ పార్టీపై వారికి ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.