Minister Harish Rao: వైద్యరంగంలో అత్యంత పారదర్శకంగా నియామకాలు జరుగుతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. కొత్తగా ఎంపికైన 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మంత్రి హరీష్ రావు నియామక పత్రాలను అందజేశారు. శిల్పకళా వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైద్య విద్యలో దేశంలోనే ఇది ఒక రికార్డు అని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని అన్నారు. 1931 మంది ఆయుష్ కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించినట్లు స్పష్టం చేశారు. అలాగే ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 22 వేల 263 మందికి ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. మరో 9 వేల 222 పోస్టులకు రెండు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఎవరైనా ప్రమాదాలకు గురైనా, అనారోగ్యానికి గురైనా వారిని కాపాడే శక్తి కేవలం వైద్యులకు మాత్రమే ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. వైద్యులు సమాజానికి మంచి సేవలు అందించాలని కోరారు.
వచ్చే నెల నుంచి టీ డయాగ్నస్టిక్స్ లో 134 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం 54 పరీక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఒక ఎయిమ్స్ ఇచ్చింనందుకు బీజేపీ నేతలు తెగ సంబరపడిపోయి.. లేని పోని ఆర్భాటాలు చేశారన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకే ఏడాదిలో తొమ్మిది కళాశాలలు ఏర్పాటు చేసింది. ఒక్కో మెడికల్ కళాశాలకు సుమారు రూ.500 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. ప్రతి లక్ష మందికి 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు.
నిమ్స్ దవాఖాన నూతన భవనానికి త్వరలోనే శంకుస్థాపన
నిమ్స్ దవాఖాన విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న 2వేల పడకల నూతన భవనానికి త్వరలో సీఎం కేసీఆర్ భూమిపూజ చేస్తారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. ఈ మేరకు త్వరగా అన్ని ఏర్పాట్లు చేయాలని, అవసరమైన అన్ని విభాగాల అనుమతులు పూర్తి చేయాలని ఇటీవలే అధికారులను ఆదేశించారు. మంత్రి హరీశ్ రావు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులతో తొలి సారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన భవనంలో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలకు ప్రత్యేకంగా బ్లాకులు ఉంటాయన్నారు.
3, 500 పడకలతో నిమ్స్ ఆస్పత్రి నూతన భవన నిర్మాణం
భవనం మొత్తం ఎనిమిది అంతస్తులుగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం నిమ్స్‌లో 1500 పడకలు ఉన్నాయని, నూతన భవనం పూర్తయితే పడకల సంఖ్య 3,500కు చేరుతుందన్నారు. ఇటీవల భూమి పూజ చేసుకున్న సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ కూడా పూర్తయితే మరో 200 పడకలు అదనంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తద్వారా ఒక నిమ్స్‌లోనే 3,700 పడకలు ఉంటాయని చెప్పారు. నిమ్స్ ఎంసీహెచ్ పనులు వేగవంతం చేయాలని అన్నారు. పెరుగుతున్న జనాభా, అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నలువైపులా ఒక్కొక్కటి వెయ్యి పడకలు కలిగి ఉండే టిమ్స్ దవాఖానలతోపాటు నిమ్స్ విస్తరణకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు.