Minister Harish Rao: తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే ధాన్యాకారంగా మారిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. నంగునూరు మండలం సిద్ధన్నపేట మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి హరీశ్ రావు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. క్వింటాల్ కు రూ2060గా నిర్ణయించారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ఏఫ్సీఐ నుంచి రావాల్సిన డబ్బులు రాకపోయినా తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం కొంటుందన్నారు.
గతంలో ఎప్పుడు కూడా ఇంత పంట పండలేదన్నారు. వడ్లు కొనమంటే బీజేపీకి చేతకాదు కానీ.. వంద కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటోందని మండిపడ్డారు. ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలన్నారు. ఈ సాగు లాభదాయకంగా ఉంటుందని మంత్రి హరీష్ రావు చెప్పారు. విజయ సంకల్ప సభలో నీళ్లు, నియామకాల విషయంలో కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపైనా హరీశ్‌రావు మాట్లాడారు. తెలంగాణలోకి నీళ్లు వచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. నీళ్లు ఎలా వచ్చాయో ఇక్కడి రైతులను అడిగితే చెబుతారని అన్నారు. నీళ్లు వచ్చాయనేందుకు పండిన పంటలే నిదర్శనమని అన్నారు. లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామని మీరే చెప్పారని, నీళ్లు లేకపోతే అవి ఎక్కడి నుంచి వస్తాయని సూటిగా ప్రశ్నించారు.
తెలంగాణలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కాస్త తమ హయాంలో 2.60 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం అయిందని గుర్తు చేశారు. పంజాబ్ తర్వాత అత్యధికంగా వరి పండించేది.. తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయిన నీతి అయోగ్ చెప్పినట్లు గుర్తుచేశారు. తప్పుగా రాసిచ్చిన స్క్రిప్టును మీరు చదివారని ప్రజలు అనుకుంటున్నారని హరీశ్ విమర్శించారు.
కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ ప్రభుత్వాలు సంతకాలు పెట్టీ మోటార్లకు మీటర్లు పెడుతున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం తెలంగాణ అలా చేయలేదన్నారు. గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ ఉండేదని, సబ్సిడీ క్రమంలోగా తెలిగించారని ఆరోపించారు. మునుగోడులో ఆత్యధికంగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. బీజేపీ గెలిస్తే ప్రజలు మీటర్లు పెట్టేందుకు అంగీకరించారని అని మోటార్లకు మీటర్లు పెడతారన్నారు. రైతు బంధు, రైతు బీమా, తాగు నీరు, కళ్యాణ లక్ష్మి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నల్గొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీ ఇలా అనేక పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. బీజేపీ నేతలు బూతులు మాట్లాడటం తప్ప ఒకటన్నా పనిచేశామని చెప్పరన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్, బండి పోతే బండి, కారు పోతే కారు, ఇల్లు పోతే ఇల్లు ఇస్తా అన్నారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.