Where is DSP Nalini: డీఎస్పీ నళిని... దోమకొండ నళిని... ఈమె చాలా మందికి గుర్తుండే ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పదవిని వదిలేశారు నళిని. 12ఏళ్ల క్రితం పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. మళ్లీ ఇన్నేళ్లకు ఆమె పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్ పడిపోయింది... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో... నళినిని గుర్తుచేసుకుంటున్నారు చాలా మంది. సోషల్ మీడియా ఆ పేరు బాగా వినిపిస్తోంది. ఆమెను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవచ్చు కదా అంటూ... సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తులు చేస్తున్నారు. అసలు నళిని ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె ఎందుకు పదవిని త్యాగం చేశారు.
2012లో తన డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు నళిని. అది తెలంగాణ ఉద్యమకాలం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న వారిపై లాఠీలు ఝుళించలేనంటూ... ఆమె ఉద్యోగానికి రాజీనామా చేశారు. తెలంగాణ ఏర్పడ్డాకే మళ్లీ ఉద్యోగం చేస్తా అంటూ.. డీఎస్పీ స్థాయి పదవిని వదిలేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి కేంద్రానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలంగా చాటారు. కానీ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆమె కనిపించకుండాపోయారు. ఉద్యమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా... నళిని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అయినా... నళినిని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని విజ్ఞప్తులు వెళ్లువెత్తుఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా వేసిన ఆమెకు మళ్లీ న్యాయం చేయాలని అడుగుతున్నాయి. అయితే... వీటన్నింటికీ సమాధానంగా... నా మనసులో మాట అంటూ... నళిని పేరు మీద ఒక మెసేజ్ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.
DSP నళిని పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్
నా మనసులో మాట.. నేను డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి 12ఏళ్లు పూర్తి అయిన తర్వాత కూడా... నన్ను ఇంకా జనం గుర్తుంచుకున్నారన్న విషయం ఈరోజు వస్తున్న మెసేజ్‌ల ద్వారా నాకు అర్థం అవుతోంది. చాలా సంతోషం.. నన్ను గుర్తుపెట్టుకున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. కొందరు జర్నలిస్టులు వాయిస్ కావాలి అని అడుగుతున్నారు... నేను దీనికి సుముఖంగా లేను. ఎందుకంటే నేను ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నాను. అందుకే ఇలా ప్రకటన చేయాల్సి వచ్చింది.
ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మగా వేద ప్రచారకురాలిగా, ఆర్ష కవయిత్రిగా తపోమయ జీవనం గడుపుతున్నాను. పూర్తి సాత్వికంగా మారాను. ఉద్యమ సమయంలో అంటే డిసెంబర్ 4, 2011న నన్ను సస్పెండ్ చేశారు. నాది దేశద్రోహం అన్నారు. చాలా బాధేసింది. సుష్మా స్వరాజ్ ఒక్కరే దాన్ని ఖండించారు. ఢిల్లీలో దీక్ష, తెలంగాణలో యాత్ర, పరకాల ఉపఎన్నికలో పోటీ, బీజేపీ సభ్యత్వం తీసుకోవడం ఇవన్నీ ఉద్యమంలో భాగంగానే చేశాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నేను ఎవరినీ కలవలేదు. ఎపుడూ నా కోసం నేను ఏమీ అడగలేదు. నా రాజీనామాను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు వినతి పత్రం ఎన్నడూ ఇవ్వలేదు. అలాంటప్పుడు ఇలా నేను సడెన్‌గా వార్తల్లోకి ఎలా వచ్చాను? ఇంతమందికి నా కాంటాక్ట్ నంబర్ ఎలా తెలిసింది? అనేది ఆశ్చర్యంగా ఉంది.
ఏది ఏమైనా ఇప్పుడు కూడా నాకు యాచించడం ఇష్టం లేదు. ఆ అవసరం నాకు లేదు కూడా. ఒకవేళ ప్రజల ఒత్తిడి మేరకు, ప్రస్తుత ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ జాబ్ ఇచ్చినా... ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నేను దానికి పూర్తి న్యాయం చేయలేను. రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల నా ఫిజికల్ ఫిట్నెస్ పోయింది. చాలా కాలం గడిచింది కాబట్టి పోలీస్ ఆప్టిట్యూడ్‌ను కూడా నేను కోల్పోయాను. ఇక టెక్నికల్ విషయాలకు వచ్చినట్లైతే, పోలీస్ సర్వీస్ రూల్స్ నా నియామకాన్ని ఒప్పుకోవు. ఎవరైనా హైకోర్టులో పిల్ వేస్తే నా నియామకం రద్దు అవచ్చు కూడా. కొరివితో తల గోక్కున్నట్లు అవుతుంది. గతంలో ముఖ్యమంత్రి రోశయ్య ఇచ్చారు కదా అని వెళితే ఏం జరిగిందో.. 18నెలలు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు ఇంకా గుర్తుంది. అందుకే నేను ఉద్యోగం అడగను. కానీ బతికి ఉన్నంత వరకు ఏదో రకంగా ప్రజాసేవ చేస్తూనే ఉంటాను.
త్యాగి నుంచి యోగినీ అయ్యి పతాంజలి సంస్థ ద్వారా ఆయుర్వేదము, యోగాను ప్రచారం చేశాను. రోగిని కూడా అయ్యి కోలుకున్నా. ఇప్పుడు తపస్వినై, నిత్యాగ్నిహోత్రినయ్యి సనాతన ధర్మ మూలాధారమైన వేదం, యజ్ఞమును ప్రచారం చేస్తున్నా. ఇదే మార్గంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నాను. ఆనాడు నాలో పొంగింది దేశభక్తి అయితే ఇప్పుడు నాలో దైవభక్తి ఉంది. ప్రస్తుతం నాలో క్షాత్రత్వం పోయి బ్రాహ్మణత్వం ప్రవేశించింది. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కదా... అలాగే ఆకలి వేయనిదే ఎవరు కూడా అన్నం కావాలి అని అడగరు.