మేడిగడ్డ అనకట్టపై జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ  ఇచ్చిన నివేదికపై తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌
కీలక వ్యాఖ్యలు చేశారు. నివేదికలో  అనకట్టకు సంబంధం లేని అంశాలున్నాయన్న ఆయన, వాస్తవాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. రాష్ట్ర అథారిటీ ఇచ్చిన వివరాలను పూర్తిగా పరిశీలించలేదన్నారు రజత్ కుమార్. జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికలో తొందర పాటు అంశాలున్నాయని వెల్లడించారు. విచారణ పూర్తికాకుండా కుంగుబాటుకు సరైన కారణాలు నిర్ధారించలేమని,  ప్రస్తుత స్థితిలో కేంద్ర అథారిటీతో అంగీకరించలేమని స్పష్టం చేశారు. క్వాలిటీ కంట్రోల్‌ సరిగా లేదన్న అభిప్రాయంతో ఏకీభవించలేమన్నారు రజత్ కుమార్.


అన్నీ పరిశీలించాకే సీడబ్ల్యూసీ అనుమతి
నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ సమీక్ష నిర్వహించారు. ఈఎన్సీలు, ఇంజినీర్లతో సమావేశమైన ఆయన నివేదికలోని అంశాలపై చర్చించారు. మేడిగడ్డపై జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ లేవనెత్తిన అంశాలు, ఆరోపణలపై తగిన వివరాలతో తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌కు రజత్ కుమార్ లేఖ రాశారు. పూర్తి మరమ్మతుల తర్వాతే బ్యారేజీ ఆపరేషన్స్‌ కొనసాగుతాయన్న ఆయన, మరమ్మతు చర్యలు ఇప్పటికే ప్రారంభమైనట్లు లేఖలో ప్రస్తావించారు. అన్ని అంశాలు పరిశీలించాకే ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇచ్చిందని, బ్యారేజీ డిజైన్‌ వివరాలను కేంద్రం విస్తృతంగా అధ్యయనం చేసిందన్నారు. అన్నీ పరిశీలించాకే సెంట్రల్ వాటర్ కమిషన్ లోని కాస్టింగ్‌ డైరెక్టరేట్‌ అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. అప్పటి సీడబ్ల్యూసీ ఛైర్మన్‌ మసూద్‌ హుస్సేన్‌, చీఫ్ ఇంజినీర్లు మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించారని తెలిపారు. కాళేశ్వరంను పరిశీలించి ఇంజినీరింగ్‌ అద్భుతంగా ఉందని కొనియాడారని, ఈ ప్రాజెక్టుతో వ్యవసాయ ఉత్పత్తి 300శాతం పెరిగిందన్నారు. కాళేశ్వరంతో భూగర్భజలాలు కూడా 7 మీటర్లకు పెరిగాయన్న రజత్ కుమార్, ఈ ప్రాజెక్టు తెలంగాణపై  మంచి ప్రభావం చూపిందన్నారు. 


బ్యారేజీ పునరుద్ధరణకు కట్టుడి ఉన్నామన్న ఎల్‌ అండ్‌ టీ
మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులపై ఎల్‌ అండ్‌ టీ సంస్థ కీలక ప్రకటన చేసింది. బ్యారేజీలో ఏడో బ్లాక్‌ పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని సంస్థ స్పష్టం చేసింది. పగుళ్లు వచ్చిన పియర్ల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని సంస్థ...ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగానే ఆనకట్టను నిర్మించినట్లు ఎల్‌అండ్‌ టీ సంస్థ పేర్కొంది. ఐదు సీజన్లుగా వరదలను ఆనకట్ట ఎదుర్కొందని తెలిపింది. మేడిగడ్డ బ్యారేజీని 2019లో అప్పగించినట్లు తెలిపింది. మేడిగడ్డ అంశం ప్రస్తుతం అధికారుల పరిశీలన, చర్చల్లో ఉందని చెప్పింది. తుదిపరి కార్యాచరణపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, నిర్ణయం చెప్పగానే దెబ్బతిన్న భాగం పునరుద్ధరణ చర్యలు చేపడుతామని వివరణ స్పష్టం చేసింది.