Medico Preethi Death Case: వరంగల్ ఎంజీఎంలో మెడికో ప్రీతి మృతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ప్రీతి మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ అలీ వాదన కూడా వినాలని కాకతీయ మెడికల్ కాలేజీని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే అతడిపై సస్పెన్షన్ ఎత్తివేయాలా, వద్దా అనేదానిపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే..
గత ఏడాది డిసెంబర్ 6వ తేదీ నుంచి మూడుసార్లు పీజీ అనస్తీషియా ఫస్టియర్ స్టూడెంట్ ప్రీతికీ, సీనియర్ సైఫ్‌కీ మధ్య విభేదాలు వచ్చాయి. సార్ అని కచ్చితంగా పిలవాలని కండీషన్ పెట్టడం, కేస్ షీట్లు చెక్ చేసి తెలివిలేదు అంటూ గ్రూపులో మెస్సేజ్ లు పెట్టడంతో ప్రీతి భరించలేకపోయింది. తాను ఏమైనా తప్పు చేస్తే గ్రూపులో మెస్సేజ్ లు కాదు, హెచ్ఓడీకి ఫిర్యాదు చేయాలని ప్రీతి పలుమార్లు తన సీనియర్ సైఫ్ కు సూచించింది. అయినా పరిస్థితిలో మార్పు లేదు, ర్యాగింగ్ కొనసాగింది. వేధింపులు ఎక్కువ కావడంతో ప్రీతి ఒత్తిడికి లోనైంది. ఫిబ్రవరి 18న వాట్సాప్ గ్రూప్‌లో ప్రీతితో ఛాటింగ్ చేసి మరోసారి వేదించాడు సైఫ్. 20వ తేదీన సైఫ్ వేధింపుల గురించి తల్లిదండ్రులకు ప్రీతి వివరించింది. మేనేజ్ మెంట్ వద్దకు విషయం చేరడంతో ఫిబ్రవరి 21న సైఫ్, ప్రీతిని పిలిచి విచారించారు. ఈ క్రమంలో 22వ తేదీన హానికారక ఇంజెక్షన్ తీసుకుని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఇది ఆత్మహత్యాయత్నం కాదని, ప్రీతికి బలవంతంగా విషపు ఇంజెక్షన్ చేశారని.. డెడ్ బాడీని హైదరాబాద్ కు తరలించి ట్రీట్మెంట్ చేశారంటూ ప్రీతి తండ్రి, సోదరుడు సంచలన ఆరోపణలు చేశారు. కూతురు బ్రెయిన్ డెడ్ అయిందని, బతికే అవకాశం లేదన్నారు. ఫిబ్రవరి 26 రాత్రి ప్రీతి బ్రెయిన్ డెడ్ అయి మృతిచెందినట్లు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.