YS Sharmila : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. కుల్చారం మండలంలో  మంతాయిపల్లి తండా గ్రామం వద్ద పొలం దున్నుతున్న రైతును కలిసి షర్మిల వారి కష్టాలు అడిగితెలుసుకున్నారు. షర్మిల కూడా పొలంలో అరక దున్నారు. అనంతరం మాట్లాడిన వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. కేసీఆర్ జాతీయ పార్టీపై స్పందిస్తూ ఉన్న దరిద్రం చాలదన్నట్లు, ఇప్పుడు దేశంపై పడతారట అంటూ ఎద్దేవా చేశారు. అమ్మకు అన్నం పెట్టలేనోడు, పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడట అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజాసమస్యలు, రైతులను సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని షర్మిల ఆరోపించారు. తెలంగాణలో ఏ వర్గాన్నీ సీఎం ఆదుకోలేదని విమర్శించారు. 






ప్రజాప్రస్థానం పాద‌యాత్ర 2400 కిలోమీట‌ర్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ యాత్రలో రైతుల కన్నీళ్లు, నిరుద్యోగుల బాధలు, మహిళల వెతలు, కార్మికుల కష్టాలు విన్నానని వైఎస్ షర్మిల అన్నారు. జనం సాక్షిగా ధైర్యంగా చెబుతున్నా వైయస్ఆర్ సంక్షేమ పాలన తీసుకొస్తానన్నారు.






కేసీఆర్, కేటీఆర్ కు సవాల్


సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. తనతో పాటు ఒక రోజు పాదయాత్ర చేయాలన్నారు. రాష్ట్రంలో సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కును నేలకు రాస్తా అన్నారు. ఒక సమస్యలు ఉన్నాయని ప్రజలు చెబితే కేసీఆర్, కేటీఆర్ ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ చేశారు.


కరీంనగర్ లో తొలి సభ 


కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ కి అనుగుణంగానే జాతీయ పార్టీ ఆలోచనను ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. తనకు మొదటి నుండి అచ్చొచ్చిన కరీంనగర్ ని జాతీయ పార్టీ మొదటి సభకు వేదికగా మలచాలని భావిస్తున్నట్లు సమాచారం. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన తర్వాత జరిగిన భారీ బహిరంగ సభ కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ లో జరిగింది "సింహ గర్జన" పేరుతో జరిగిన అప్పటి సభకు జనాలు స్వచ్ఛందంగా లక్షలు గా తరలివచ్చారు. అప్పుడప్పుడే ఊపిరి పోసుకుంటున్న మలిదశ తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ చుక్కానిలా మారింది. కేసీఆర్ కి రాజకీయంగా గండం ఏర్పడినప్పుడల్లా అక్కున చేర్చుకున్న కరీంనగర్ జాతీయ పార్టీ విషయంలో కూడా అదేవిధంగా దగ్గరికి తీసుకుంటుంది. అనేది కేసీఆర్ భావన అందుకే జాతీయ పార్టీని హైదరాబాదులో ప్రకటించినప్పటికీ జరపాల్సిన తొలి సభ మాత్రం కరీంనగర్ ని వేదికగా మలుచుకుంటున్నట్లు సమాచారం.