Medak BRS Mlas Clarity On Rumours: తాము పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఉమ్మడి మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖండించారు. మంగళవారం సీఎంను కలిసి నియోజకవర్గాల సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరినట్లు స్పష్టం చేశారు. కాగా, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Mahipal Reddy), నర్సాపూర్ ఎమ్మెల్యే (Narsapur MLA) సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్ రావు మంగళవారం సాయంత్రం సీఎంను ఆయన నివాసంలో కలిశారు. ఒకేసారి నలుగురు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ ను కలవడంపై ఆసక్తి నెలకొంది. వారు పార్టీ మారుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీనిపై తెలంగాణ భవన్ లో బుధవారం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టత ఇచ్చారు. తాము పార్టీ మారే ప్రసక్తే లేదని.. కేసీఆర్ వెంటే ఉంటామని చెప్పారు.





'అది మా హక్కు'






తమ నియోజకవర్గాల సమస్యలు, అభివృద్ధి గురించి చెప్పడం తమ హక్కు అని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. తాము ఎవరితోనూ చర్చలు జరపలేదని.. మెదక్ జిల్లా సమస్యలు వివరించేందుకే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు స్పష్టం చేశారు. దీనిపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇది సరికాదని అన్నారు. తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరైనా ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుందని చెప్పారు. తమకు పార్టీపై గౌరవం ఉందని.. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తామని పేర్కొన్నారు. మెదక్ జిల్లాకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. 'మెదక్ జిల్లా గులాబీ జెండాకు పుట్టినిల్లు. కేసీఆర్ సారథ్యంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని గెలుచుకుంటాం. అపనిందలు మోయాల్సి రావడం బాధాకరం' అని లక్ష్మారెడ్డి అన్నారు.


'కాంగ్రెస్ లో ఎందుకు చేరుతాం' 


తెలంగాణ ఉద్యమం ఆరంభం నుంచి బీఆర్ఎస్ లోనే ఉన్నామని.. అలాంటిది తాము కాంగ్రెస్ లో ఎందుకు చేరుతామని దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సీఎంను కలిసి మెదక్ జిల్లా సమస్యల గురించి చెప్పినట్లు స్పష్టం చేశారు. అంతకు ముందు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరినట్లు గుర్తు చేశారు. 'మెదక్ జిల్లాలో ప్రోటోకాల్ పాటించడం లేదని సీఎం దృష్టికి తెచ్చాం. సీఎం, మంత్రులు, అధికారులను కలిస్తే తప్పా.?. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. వాటిని ఎప్పటి నుంచి అమలు చేస్తారని అడుగుతున్నాం. రెండు వారాలైనా మల్లన్న సాగర్ నుంచి నీళ్లు వదలడం లేదు. వచ్చే ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ లో గులాబీ జెండా ఎగురుతుంది.' అని ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే హామీలు నెరవేర్చాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. బీఆర్ఎస్ ను బొంద పెడతానన్న రేవంత్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని అన్నారు. తమ పార్టీని బొంద పెట్టే వారు ఎవరూ లేరని చెప్పారు.


'ఆ వార్తలు ఖండిస్తున్నా'


తాము పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. స్థానిక సమస్యలపై ఇది వరకే ఎస్పీ, కలెక్టర్ ను కలిశామని దానికి కొనసాగింపుగానే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు స్పష్టం చేశారు. తాను బతికున్నంత కాలం బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదని చెప్పారు. రేవంత్ ప్రధాని మోదీని కలిస్తే బీజేపీలో చేరినట్టేనా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా సాగిందని.. ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని అన్నారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి, రాజకీయాలకు సంబంధం లేదని పేర్కొన్నారు.


'సమస్యల పరిష్కారానికే'


తాము ప్రజా సమస్యల పరిష్కారానికే సీఎం రేవంత్ ను కలిశామని జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలోని పనులను ఆపాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. అలాంటి వాటిని ఆపాలని కోరారు. మున్సిపాలిటీలకు కేటాయించిన నిధులు ఆపుతున్నారని.. అవి ఆపొద్దని సీఎంను కోరినట్లు చెప్పారు. భద్రతకు సంబంధించిన అంశాలపైనా సీఎంతో చర్చించినట్లు పేర్కొన్నారు. 'కేసీఆర్ నాకు ఎమ్మెల్యేగా రాజకీయ జన్మ ఇచ్చారు. నా ప్రయాణం జీవితాంతం ఆయనతోనే. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కోసం కృషి చేస్తాను.' అని తెలిపారు.


Also Read: Richest Districts: తెలంగాణలో రిచ్చెస్ట్ జిల్లాగా రంగారెడ్డి - భాగ్య నగరానికి ఎన్నో స్థానమంటే?