Operation Kagar | మావోయిస్టులను అంతం చేస్తాం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అయితే తమను అరికట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ కగార్ ను అడ్డుకుంటామని మావోయిస్టులు అంటున్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వానికి  అంతర్గత భద్రత విషయంలో కంట్లో నలుసుగా మారింది మావోయిస్టు పార్టీ.  దేశ అభివృద్ధికి మావోలు ఆటంకం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంటే,  దేశ సంపదను ప్రజలకు పంచకుండా గంప గుత్తగా  ఒకరిద్దరు పెట్టుబడి దారుల చేతుల్లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని మావోయిస్టు పార్టీ ఆరోపిస్తుంది.


ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు కీలక ప్రకటన


 2026 నాటికి మావోయిస్టు పార్టీని దేశంలో అంతం చేయడమే మా లక్ష్యం అని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు ప్రకటిస్తే, మీ ఆపరేషన్ కగార్ ను అడ్డుకుని తీరడమే మా పంతం అని మావోయిస్టులు ప్రకటిస్తున్నారు. మహరాష్ట్ర, చత్తీస్ ఘడ్,  ఆంధ్ర - ఒరిస్సా బోర్డర్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో అంటే మావోయిస్టుల ప్రభావ ప్రాంతాల్లో  ఓ యుద్దమే జరుగుతుందని చెప్పాలి. నిత్యం తుపాకి చప్పుళ్లతో, మందు పాతర పేళ్లుళ్లతో అటవీ గ్రామాలు చిగురుటాకుల్లో వణికిపోతున్నాయి. పచ్చటి అడవిలో వెచ్చటి నెత్తురు వర్షం కురుస్తోంది. ఇంతటి భీతావాహ పరిస్థితులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నెలకొంది.


ఇదంతా ఎందుకంటే  ఈ నెల 21వ తేదీ నుండి  అక్టోబర్ 20వ తేదీ వరకు  పార్టీ  సంస్థాపక వార్షికోత్సవాలు జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పీపుల్స్ లిబరేషన్  గెరిల్లా ఆర్మీకి, పార్టీ శ్రేణులకు, మావోయిస్టు సానుభూతిపరులకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో  అటు మావోయిస్టు పార్టీ ఏం అనుకుంటుంది,  ఇటు కేంద్ర ప్రభుత్వం ఏం అంటుందో ఓ సారి చూద్దాం.


20 ఏళ్లలో మావోయిస్టు పార్టీ ఏం కోల్పోయిందో తెలుసా..?


గత ఇరవై ఏళ్లలో మావోయిస్టు పార్టీ  అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంది. దాడులు -ప్రతి దాడుల మధ్య నలిగిపోయింది. అత్యంత  కఠినమైన పరిస్థితులను క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంది. సేఫ్ జోన్లు అనుకున్న చోట రక్తం ఏరులై పారింది. పట్టణ ప్రాంతాల్లో షెల్టర్ ఇచ్చే వారు, పార్టీకి ఫండింగ్ చేసే వారు కరువయ్యారు. కోవర్ట్ ఆపరేషన్లు ఎదుర్కొంది. కీలమైన ముఖ్య నాయకులను పార్టీ కోల్పోయింది. గడచిన 20 ఏళ్లలో  22 మంది కేంద్ర కమిటీ సభ్యులను  ఎన్ కౌంటర్లలో కోల్పోయింది.  అందులో 8 మంది కీలకమైన పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు.  పోలీసు దాడుల్లో 5249 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో దాదాపు వేయి మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు.  ఈ  ఏడాది జులై వరకు లెక్క తీస్తే పోలీస్ దాడుల్లో 171 మంది  ప్రాణాలు కోల్పోయారు.   మావోయిస్టుల లెక్క ప్రకారం  63 మంది సాధారణ పౌరులు, 44 మంది మావోయిస్టులు ఉన్నారు. ఇందులో 8 మంది గ్రామాణ మహిళలు ఉన్నారు. బీజాపూర్ జిల్లా ముద్దం గ్రామంలో 6 నెలల పసికందు ప్రాణాలు కోల్పోయింది. ఇంతటి మారణహోమం తమ పార్టీ ఎదుర్కొన్నట్ల మావోయిస్టులు తాజా విడుదల చేసిన లేఖలో  పేర్కొన్నారు.


తామేం తక్కువ తినలేదని నిర్బంధం, ఎన్ కౌంటర్లను ఎదుర్కొంటునే  ఈ  20 ఏళ్లలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ  4073 దాడులు నిర్వహించినట్లు మావోయిస్టులు చెబుతున్నారు.  ఇందులో 3090 మంది చనిపోయారన్నది కామ్రెడ్స్ లెక్క. అయితే మూడేళ్లుగా శత్రువు నిర్బంధ పరిస్థితుల్లో,  పోలీస్ దాడుల్లో పార్టీ నష్టపోకుండా ఉండేందుకు డిఫెన్స్ వ్యూహంలో ఉన్నట్లు మావోయిస్టులు చెబుతున్నారు. అంటే అగ్రెసీవ్ గా తాము ఎదురు దాడులు చేయకుండా  వెనుకంజ వ్యూహంతో సాగుతుంటే కేంద్ర ప్రభుత్వమే రెచ్చగొట్టేలా ఆపరేషన్ కగార్ పేరుతో తమపై దాడులకు దిగుతోందన్నది  మావోయిస్టు పార్టీ ఆరోపణ.  ఈ మూడున్నరేళ్లలో 439 మంది పార్టీ సభ్యులను కోల్పోయామని,  215 ఆయుధాలు కోల్పోయినట్లు, కొంత మేర ఉద్యమం కూడా  బలహీనపడిందని  మావోయిస్ట్ పార్టీ తన  అంతర్గత సమీక్షలో తెల్చి చెప్పింది.  అయితే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ ను మాత్రం తిప్పికొట్టడం ఖాయమని ఇదే తమ లక్ష్యమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.


2026 కల్లా దేశంలో మావోయిస్టు పార్టీ ఖేల్ ఖతం.. కేంద్రం


2026 కల్లా దేశంలో మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మోదీ ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే.. తమ వందరోజుల పాలనలో మావోయిస్టులను అంతం చేయడం తమ ప్రాధాన్యత అంశంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.  2014 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీ దాదాపు 200 జిల్లాల్లో తమ ప్రభావం చూపుతుంటే, దాన్ని తమ ప్రభుత్వం  అధికారంలోకి వచ్చాక ఆ ప్రభావం తగ్గించామని చెబుతోంది. 2024 సెప్టెంబర్ నాటికి 43 జిల్లాలకు మాత్రమే మావోయిస్టుల ప్రభావాన్ని పరిమితం చేశామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ఏడాది జనవరి నాటికి 700 మంది మావోయిస్టులను లొంగిపోయేలా చేయడమే, లేక ఎన్ కౌంటర్లలో చంపడమో జరిగిందని కేంద్ర ప్రభుత్వం  లెక్కలు చెబుతున్నాయి. 2026 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని ఇదే తమ  లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ చెబుతోంది. ఇది కేంద్ర ప్రభుత్వ వర్సెస్ మావోయిస్టు పార్టీ అన్నట్లుగా మారింది. అయితే ప్రస్తుత ప్రజాస్వామిక దేశంలో భౌతికంగా రూపు మాపడం వల్ల  ఒక సిద్దాంతం చచ్చిపోతుందనుకుంటే అది భ్రమే.


ఇప్పటి వరకు ప్రపంచ చరిత్ర చూసినా, మన దేశంలో నక్సలిజం పురుడు పోసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు  జరిగిన నక్సల్ చరిత్ర చూసినా అతి తప్పే అని  అర్థం అవుతుంది. అదే రీతిలో  ఓ ప్రజా స్వామ్య దేశంగా పరిణితి చెందుతూ అడుగులు వేస్తోన్న మన భారత దేశంలో తుపాకితనో, తూటాలతోనో రాజ్యం సాధిస్తామని అనుకోవడం కూడా ఓ భ్రమే. ప్రజా బలంతో రాజ్యాల నిలబడతాయే తప్ప తుపాకి తూటాలతో రాజ్యాన్ని సాధించుకోలేమన్నది కూడా మన కళ్ల ముందు ఉన్న చరిత్రనే.  ఈ చరిత్ర చెబుతోన్న పాఠాలు  అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు  మావోయిస్టు పార్టీ  గుర్తిస్తే  మన దేశం ప్రజాస్వామ్య పరిణితి గల దేశంగా మరింత ముందుకు సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


Also Read: Jammu And Kashmir: బారాముల్లాలో ఎన్ కౌంటర్‌ - పారిపోతున్న ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం, వైరల్ వీడియో