Telangana BJP :   ప్రధాని మోడీ నిజామాబాద్ భారీ బహిరంగ సభకు పలువురు సీనియర్లు మరోసారి గైర్హాజరయ్యారు. మొన్నటికి మొన్న పాలమూరు సభకు అటెండ్ అవ్వని నేతలంతా ఈ సభకు కూడా హాజరు కాలేదు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాలమూరు సభకు హాజరై.. నిజామాబాద్ సభకు వెళ్లలేదు. ఇకపోతే మాజీ ఎంపీ వివేక్ పాలమూరు సభ సందర్భంగా శంషాబాద్ వరకు వెళ్లి ప్రధానికి స్వాగతం పలికారు. కానీ సభకు వెళ్లలేదు. ప్రధాని నిజామాబాద్‌లో ఉండగా.. వివేక్ ఢిల్లీకి వెళ్లడం గమనార్హం. అక్కడ రాష్టప్రతి ద్రౌపది ముర్మును ఆయన కలిశారు. కాగా ఈ సభకు విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి సైతం గైర్హాజరయ్యారు. కీలక నేతలే ప్రధాని మోడీ సభకు డుమ్మా కొట్టడంపై బీజేపీలో చర్చ జరుగుతోంది. 

మోదీ సభకు డుమ్మా కొట్టిన వాళ్లు పార్టీ మారుతారని ప్రచారం                                           

 సోషల్ మీడియాలో ఈ నేతలు త్వరలో పార్టీ వీడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరంతా కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు విసృత ప్రచారం జరుగుతోంది. వారు హాజరుకాకపోవడం వెనుక ఉద్దేశమేంటనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ప్రియారిటీ దక్కడంలేదని పలు దఫాలుగా వీరంతా సీక్రెట్ మీటింగులు పెట్టుకున్నారు.  ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో టచ్‌లోకి వెళ్లారని.. మరోవైపు విజయశాంతి, వివేక్‌లు కూడా సొంత గూటికి చేరాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ప్రాాధాన్యత దక్కడం లేదని కొద్ది రోజులుగా  కొంత మంది నేతల అసంతృప్తి        

సోషల్ మీడియాలో విజయశాంతి స్పందనల్లో ఎక్కడా  బీజేపీ ప్రస్తావన తీసుకు రావడం లేదు. బీఆర్ఎస్‌ను ఓడించేందుకు ఏమైనా చేస్తామంటూ  పార్టీ మార్పుపై రాజగోపాల్ స్వయంగా చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశం అవుతున్నాయి. సాధారణంగా పార్టీలో ఎలాంటి సమస్యలు ఉన్నా. ప్రధాని లాంటి అగ్రనేత రాష్ట్ర పర్యటనకు వస్తే సీనియర్ నేతలంతా హాజరవుతారు. ప్రధాని సభకే రాలేదంటే..వారికి పార్టీలో ఉండే ఉద్దేశం లేదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది. పాలమూరు సభకు సీనియర్లు డుమ్మా కొట్టడంతో కిషన్ రెడ్డిని బీజేపీ హైకమాండ్ ఢిల్లీ పిలిపించింది. అందరూ కలసి కట్టుగా పని చేయాలని సూచిస్తే ఎందుకిలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని అడిగినట్లుగా తెలుస్తోంది.

 

 

బీఆర్ఎస్ ను ఓడించే పార్టీగా కాంగ్రెస్ ను చూస్తన్నారా ?     

తెలంగాణలో బీజేపీ విజయం కోసం పని చేస్తుందని  కొంత మంది నేతలు ఇప్పటికీ నమ్మలేకపోతున్నార. కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉందని.. ఆ పార్టీ వైపు మొగ్గు చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ బలమైన నేతలు, ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న వారికి మాత్రమే పార్టీలో ప్రవేశం కల్పించాలని కాంగ్రెస్ అనుకుంటోంది. టిక్కెట్  షరతు లేకుండా ఎవరు పార్టీలోకి వచ్చినా ఆహ్నానిస్తామంటున్నారు.