Mancherial News : మంచిర్యాల జిల్లా ఇందారంలో హత్యకు గురైన మహేష్ మృతదేహానికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు జైపూర్ పోలీసులు.  పోస్ట్ మార్టం అనంతరం మహేష్ మృతదేహాన్ని ఇందారం గ్రామానికి తరలించారు. దీంతో ఇందారంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహేష్ డెడ్ బాడీతో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మహేష్ ను చంపిన పెద్దపల్లి కనకయ్యతో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో మహేష్ ను హత్య చేసిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 


అసలేం జరిగింది?  


మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా, అసభ్య పదజాలంతో మెసేజ్ లు పెడుతున్న కారణంగా ఓ యువకుడిని ఆ యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా హతమార్చారు. ముషిక మహేష్ (28) అనే యువకుడు బండిలో పెట్రోల్ పోయించుకుని వస్తున్న క్రమంలో ఓ కుటుంబం అతన్ని అడ్డగించింది. ఇద్దరు అతన్ని గట్టిగా పట్టుకోగా, మరో ఇద్దరు మేకలు కోసే కత్తులతో గొంతు కోసి బండరాయితో మోది చంపేశారు. అందరూ చూస్తుండగానే ఈ సంఘటన జరిగినా ఎవరూ కూడా ఆపేందుకు ముందుకు రాలేదు. పైగా దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 


అసభ్యంగా మెసేజ్ లు పెట్టాడని


ఇందారంలో మహేష్ కు యువతికి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఆమెకు మరో వ్యక్తితో పెళ్లైంది. ఆ యువతి భర్త సంవత్సరం కిందట ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీంతో ఆమె తల్లిగారింటి వద్దే ఉంటోంది. మహేష్ ఫోన్ ద్వారా అసభ్య పదజాలంతో మెసేజ్ లు పంపిస్తుండటంతో ఆమె కుటుంబం మహేష్ ను హెచ్చరించింది. పోలీస్ స్టేషన్ లో పలుమార్లు కేసులు పెట్టినా, మహేష్ వేధింపులు ఆపలేదు. దీంతో ఆ కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం మాటువేసి మహేష్ ను రాళ్లతో కొట్టి చంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మహేష్ ను చంపిన వారిని తమకు అప్పగించాలని మహేష్ బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 


స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. మహేష్ వివరాలు తెలుసుకున్నారు. వారి ఫ్యామిలీ నుంచి పూర్తి వివరాలు తెలుసుకొని చంపింది మాజీ ప్రేయసి బంధువులేనని నిర్దారణకు వచ్చారు. వెంటనే నలుగురు నిందితులను అరెస్టు చేశారు. విచారణ చేపట్టారు. తమవారు ఎలాంటి తప్పు చేయలేదని నిందితుల తరఫు బంధువులు ఆందోళన చేపట్టారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మహేష్ పై యువతి బంధువులు ఫిర్యాదు చేశారనే మాట వినిపిస్తోంది. పెళ్లైన తమ బిడ్డను నిత్యం వేధించేవాడని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారని టాక్. అయినా పోలీసులు చర్యలు తీసుకోలేదని విమర్శులు వినిపిస్తున్నాయి. అందుకే విసిగిపోయి దాడికి తెగబడ్డట్టు వారు చెబుతున్నారు.