Mamatha Benerjee Call to CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఫోన్ చేసి మాట్లాడారు. జాతీయ రాజకీయాలతో పాటు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించారు. త్వరలో ఢిల్లీలో నిర్వహించనున్న ఎన్డీఏయేతర, ప్రతిపక్ష పార్టీలు ఈ సమావేశానికి హాజరుకావాలని కోరారు. ఇటీవల సీఎం కేసీఆర్ తీసుకున్న కొత్త జాతీయ పార్టీ నిర్ణయంపై మమత సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. బీజేపీని కేంద్రంలో గద్దె దింపాలన్నదే వీరి ఉమ్మడి లక్ష్యాల్లో ఒకటి కనుక.. బీజేపీని ఓడించేందుకు కొత్త పార్టీల అవసరం ఉందని మమత తన అభిప్రాయాన్ని చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఈనెల 15న ప్రతిపక్ష పార్టీల సీఎంలు, ఇతర కీలక నేతల సంయుక్త సమావేశానికి హాజరు కావాలని సీఎం కేసీఆర్ సహా మరో ఏడు రాష్ట్రాల సీఎంలకు మమత లేఖలు రాశారు.
కలిసికట్టుగా విపక్షాలు..
దేశాన్ని పీడిస్తున్న సమస్య బీజేపీ అని, కేంద్రంలోని ఎన్డీయేకు అడ్డుకట్ట వేయాలనే దిశగా విపక్ష పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ కొత్త పార్టీ (భారతీయ రాష్ట్రీయ సమితి) ఏర్పాటు చేయాలన్న ఆలోచనను అభినందించారు. జూన్ 15న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఏర్పాటుచేయనున్న సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సహా దేశంలోని 8 మంది ముఖ్యమంత్రులు, 22 మంది వివిధ పార్టీల నేతలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం రోజురోజుకూ తగ్గిపోవడంతో తాను ప్రత్యామ్నాయంగా మారుతూ చొరవ తీసుకున్నారు.
రాష్ట్రపతి ఎన్నికలే టార్గెట్..
త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపి, బీజేపీకి అడ్డుకట్ట వేయాలని సీఎం కేసీఆర్‌తో మమత చర్చించారు. దేశ ప్రతిష్ఠను, ప్రజాస్వామ్య మౌలిక సూత్రాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై సైతం ఉందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ, కేరళ, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, ఎస్పీ, ఎన్సీపీ, ఆఎల్డీ, జేడీఎస్, నేషనల్ కాన్ఫరెన్స్ (NC), శిరోమణి అకాలీదళ్, పీడీపీ తదితర పార్టీల నేతలకు ఢిల్లీలో సమావేశం అవుతామని మమత లేఖల ద్వారా ఆహ్వానించారు.
అయితే ఏపీ నుంచి అటు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిగానీ, ఇటు చంద్రబాబునాయుడు, తెలంగాణలో అసదుద్దీన్ ఒవైసీల పేర్లు ఈ జాబితాలో కనిపించలేదు. శరద్‌పవార్, దేవెగౌడలాంటి సీనియర్ నేతలను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీయే కూటమిని ఎదుర్కోవాలంటే విపక్షాలు కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది.