Malkajigiri MP constituency  :  మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేసే చాన్స్ లేదని .. టిక్కెట్ వేరే వాళ్లకు ఇవ్వాలని మేడ్చల్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి మల్లారెడ్డి .. భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ  తన కుమారుడు భద్రారెడ్డికి ఎంపీ టిక్కెట్ కావాలని ఆయన డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కేసీఆర్ కూడా భద్రారెడ్డికి టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో మల్లారెడ్డి తన కుమారుడి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నారు. అయితే  హఠాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. పోటీ చేయలేనని చేతులెత్తేశారు. మల్లారెడ్డి నిర్ణయానికి..  పలు కారణాలు ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.           


మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీల్లో గురువారం అక్రమ కట్టడాల కూల్చివేత చేపట్టారు. ఈ క్రమంలో మర్రి రాజశేఖర్ రెడ్డితో  పాటు మల్లారెడ్డి .. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సమావేశం అయ్యారు. రెండు గంటల పాటు చర్చలు జరిపారు.ఆ తర్వాత కూడా కూల్చివేతలు సాగాయి. కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవడంతో నిలిపివేశారు. వారు వేం నరేందర్ రెడ్డితో సమావేశమైన సమయంలో.. ఎమ్మెల్యేలు అయిన మామా అల్లుళ్లు ఇద్దరూ కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ తాము బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రశ్నే లేదని.. కాంగ్రెస్ లో చేరడం లేదని ప్రకటించారు.                         


అయితే పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తే మరింతగా వేధింపులు పెరుగుతాయని మల్లారెడ్డి కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా భావిస్తున్నారు. మల్లారెడ్డి తో పాటు ఆయన బంధువులు యాభైకిపైగా ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు నిర్వహిస్తున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం సహా పలు రకాల వ్యాపారాలు ఉన్నాయి. పలు భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం వీటిపై దృష్టి పెడితే మల్లారెడ్డి కుటుంబం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.                             


అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మల్లారెడ్డికి పాత వైరం ఉంది. రేవంత్  ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనపై మల్లారెడ్డి తొడకొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఘాటుగా విమర్శలు కూడా చేశారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సీఎం కావడంతో అవన్నీ గుర్తుంచుకుని.. ఏమైనా చర్యలు తీసుకుంటే.. ఇబ్బంది  పడతానన్న ఉద్దేశంలో మల్లారెడ్డి పోటీకి వెనుకడుగు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల తర్వాత ఆయన పార్టీ మారినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.