Symbol Politics : తెలంగాణ అధికారిక చిహ్నం మార్చే ప్రయత్నాల్లో ప్రభుత్వానికి పెద్దగా సపోర్టు లభించడం లేదు. అనధికారిక మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ పార్టీ కూడా చిహ్నం మార్పు విషయంలో వ్యతిరేకత వ్యక్తం చేసింది. చార్మినార్ ను రాచరికానికి గుర్తుగా చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిహ్నంలో ఆ గుర్తును తీసేయాలని అనుకుంటున్నారు. కొన్ని డిజైన్లను ఖరారు చేశారు. వాటిలో చార్మినార్ గుర్తు లేదు. ఆ గుర్తును తీసేయవద్దని కేటీఆర్ కూడా చార్మినార్ వద్ద నిరసన తెలిపారు. ఈ క్రమంలో మజ్లిస్ కూడా స్పందించింది. చార్మినార్ అనేది తెలంగాణ చరిత్ర, సంస్కృతికి నిదర్శనమని..దాన్ని అధికారిక చిహ్నంలో కొనసాగించాలన్నారు. అలాగే చార్మినార్ చుట్టుపక్కల అభివృద్ధి చేయాలని మజ్లిస్ కోరింది.
అంతకు ముందు కేటీఆర్ తెలంగాణ అధికారిక ముద్ర మార్పును నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలతో కలిసి చార్మినార్ వద్ద ఆయన ధర్నాకు దిగారు. రాజముద్ర నుంచి చార్మినార్‌ను తొలగించడానికి కుట్ర జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ అనగానే మొదట గుర్తొచ్చేది హైదరాబాద్, చార్మినార్ అని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఐకాన్‌గా చార్మినార్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందన్నారు. నాడు ఎన్టీఆర్ కాకతీయ కళాతోరణం ప్రతిమను ట్యాంక్‌బండ్‌కు ఇరువైపులా పెట్టారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, కేసీఆర్ పెట్టిన గుర్తులు మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు .
రాజముద్రను ఇంత అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రగతిని కనిపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ పేరు కనిపించకుండా మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. లోగోలో చార్మినార్‌ను తొలగించడం అంటే హైదరాబాదీలను అవమానించడమేనన్నారు. అమరవీరుల స్థూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను చేర్చితే అభ్యంతరం లేదని చెప్పారు. అధికారిక చిహ్నంలో మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. అమర వీరుల స్థూపాన్ని రాజముద్రలో పెట్టినంత మాత్రాన.. కాంగ్రెస్ పార్టీ వల్ల అమరులైన వారి తల్లిదండ్రులు సంతోష పడరని చెప్పారు.
తీవ్రమైన విమర్శలు వస్తూండటం బీఆర్ఎస్ రాజకీయ అస్త్రంగా మల్చుకునే ప్రయత్నం చేస్తూండటంతో సీఎం రేవంత్ రెడ్డి తాత్కలికంగా రాజముద్ర మార్పును వాయిదా వేశారు. ఇంకా విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు.