Mahesh Babu Seeks Time To Attend ED Investigation: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఈడీ అధికారులకు లేఖ రాశారు. ఓ యాడ్ విషయంలో రెమ్యునరేషన్‌తో పాటు ఇతర  వివరాలకు సంబంధించి ఆయనకు ఇటీవలే ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆదివారం విచారణకు హాజరు కావాలని తెలపగా.. మహేష్ బాబు హాజరు కాలేదు. 

ప్రస్తుతం తాను మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నానని.. అందుకే విచారణకు హాజరు కాలేకపోయానని మహేష్ బాబు లేఖలో వివరించారు. సోమవారం కూడా షూటింగ్ ఉందని.. విచారణ కోసం మరో తేదీ ఇవ్వాలని ఈడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Also Read: నాకూ బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయ్! - 'ఇతను ఎన్నో బాయ్ ఫ్రెండ్?' అని అడిగేవారన్న శ్రుతి హాసన్

అసలేం జరిగిందంటే?

సాయి సూర్య డెవలపర్స్, సురనా గ్రూప్ కంపెనీల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ‌ (Enforcement Directorate) విచారణ చేసింది. ఆ సంస్థకు మహేష్ బాబు యాడ్స్ చేశారు. ఈ 2 సంస్థలకు ఆయన అంబాసిడర్‌గా ఉన్నారు. ఇందుకోసం మహేష్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 

సాయి సూర్య డెవలపర్స్ కంపెనీకి చెందిన ప్రాపర్టీలకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించగా.. ఆ యాడ్స్ చేసినందుకు రూ.5.90 కోట్ల రెమ్యునరేషన్ ఆయన తీసుకున్నారట. రూ.3.50 కోట్లు నగదు రూపంలో, రూ.2.50 కోట్లు ఆన్లైన్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ఆయనకు సంస్థ అందజేసినట్లు సమాచారం. ఆ పారితోషికం విషయంలో (ఆర్థిక లావాదేవీలకు సంబంధించి) విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. పెట్టుబడులు పెట్టేందుకు ఇన్‌ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే, షూటింగ్ ఉన్నందున మరో తేదీ ఇవ్వాలంటూ మహేష్ బాబు అధికారులకు రిక్వెస్ట్ చేశారు. దీనిపై మరి అధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

రాజమౌళి మూవీ షూటింగ్‌లో బిజీగా..

ప్రస్తుతం మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి 'SSMB29' మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. భారీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ షూటింగ్ ప్రజెంట్ హైదరాబాద్ సిటీలో జరుగుతుంది. ఓ యాక్షన్ సీన్ కోసం ప్రత్యేకంగా ఓ భారీ బోట్ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఇందులో మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్‌తో పాటు దాదాపు 3 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొననున్నారని సమాచారం. ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు. మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తుండగా.. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. 2027 మార్చిలో మూవీ రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.