Minister Srinivas Goud : సీఎం కేసీఆర్ పిలుపు మేరకు స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అందులో భాగంగా ప్రతి రోజూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఫ్రీడం రన్, ఫ్రీడం వాక్ అనే కార్యక్రమాలు ఇందులో భాగమే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం మహబూబ్ నగర్ లో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్రీడం వాక్ జరిగిందని, ఈ వాక్ లో తాను నిజమైన తుపాకీ పేల్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇష్టానుసారంగా కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ర్యాలీలు జరిగినపుడు బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ తో గాల్లోకి కాల్చడం పరిపాటి అన్న మంత్రి మూడు రోజుల క్రితం కూడా వరంగల్ లో బ్లాంక్ గన్ తో గాల్లోకి కాల్చానన్నారు.
బుల్లెట్లు లేవు
బుల్లెట్లు ఉండని గన్ తో కాలిస్తే చప్పుడే వస్తుంది. బుల్లెట్లు ఉండవు కనీసం పిల్లెట్లు కూడా ఉండవు. జిల్లా ఎస్పీ స్వయంగా గన్ ఇచ్చారు. ఎస్పీకి గన్ ఇచ్చే అధికారం ఉంది. నేనంటే గిట్టని వారే మొదటి నుంచి బట్ట కాల్చి మీదెస్తున్నారు. 25 వేల మంది ర్యాలీలో పాల్గొనడం మహబూబ్ నగర్ లో ఇదే ప్రథమం. దీంతో కొందరి కళ్ళు మండుతున్నాయి. నేను కూడా జర్నలిజం చదివాను. వార్తలు రాసే ముందు కనీస వివరణ తీసుకోవాలన్న సోయి లోపించడం బాధాకరం. క్రీడల మంత్రిగా నాకు కొన్ని అధికారాలు ఉన్నాయని తెలుసుకోవాలి. వరంగల్ లో రాని వివాదం మహబూబ్ నగర్ లో ఎందుకు వస్తోంది. బురద జల్లే పద్దతి రాజకీయాల్లో మంచిది కాదు. - మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎదుగుదల ఓర్చుకోలేకే
రాజకీయాల్లో తాను ఎదగడాన్ని కొందరు ఓర్చుకోలేకపోతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తనకు సంబంధించి చిన్న అంశాలను కూడా గోరంతను కొండంతలు చేస్తున్నారన్నారు. తాను రైఫిల్ అసోసియేషన్ సభ్యుడినని మంత్రి తెలిపారు. తుపాకులు, బుల్లెట్ల గురించి తనకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. తాను అంగూటా చాప్ రకం కాదని, వజ్రోత్సవాలు జరుగుతున్నపుడు మంచిని హైలైట్ చేయకుండా చిన్న ఘటనలపై కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టు చేయవద్దని హితవు పలికారు. ఇంతకు ముందు ఇలాంటివి తనపై చాలా చేశారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తారని, దుష్ప్రచారాన్ని తిప్పికొడతారన్నారు.
కాల్పుల కలకలం
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాల్లోకి కాల్పులు జరిపారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు.. యువకులు పాల్గొన్న ర్యాలీ కొనసాగుతున్న సమయంలో హఠాత్తుగా పోలీసుల వద్ద నుంచి ఎస్‌ఎల్ఆర్ తుపాకీని తీసుకున్నారు. గాల్లోకి గురి పెట్టి కాల్పులు జరిపారు. ఒక్క సారిగా తూటాల శబ్దం వచ్చే సరికి ఆ చుట్టుపక్కల ఉన్న చాలా మందికి ఏం జరిగిందో అర్థం కాలేదు. తర్వాత మంత్రిగారే గాల్లోకి కాల్పులు జరిపారని తేలింది. మంత్రి గాల్లోకి కాల్పులు జరుపుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. శ్రీనివాస్ గౌడ్ కాల్పులు జరుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సంచలనంగా మారింది. ఎంత మంత్రి అయితే మాత్రం ఇలా గాల్లోకి కాల్పులు జరుపుతారా అని ప్రశ్నిస్తున్నారు. తక్షణం మంత్రిపై చర్యలు తీసుకోవాలని... గన్ ఇచ్చిన పోలీసుల అధికారిపైనా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. సాధారణంగా పెళ్లి బారాత్‌లలో కొంత మంది ఇలా గాల్లోకి లైసెన్స్‌డ్ తుపాకులతో కాల్పులు జరిపినా తీవ్రమైన కేసులు పెడతారు. ఇప్పుడు మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Also Read : Srinivas Goud Firing : కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..
Also Read : KTR On MODI : పథకాలన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా ? - ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్ !