Mahabubabad Accident : మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లాలో గ్రానైట్ బండరాయి పడి నలుగురు కూలీలు మృతి చెందారు. లారీలో తరలిస్తున్న గ్రానైడ్ రాయి  ఆటోపై పడి ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. కురవి మండలంలోని అయ్యగారి పల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు చిన్న గూడూరు మండలంలోని జయ్యారం వాసులుగా గుర్తించారు. కూలి పనుల కోసం వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 10 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 



 అసలేం జరిగింది?


మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కురవి వద్ద జాతీయ రహదారిపై ఆటోపై గ్రానైట్‌ లారీపై నుంచి బండరాళ్లపడిపోయాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్‌ సహాయం బండరాళ్లను రోడ్డుపై నుంచి తొలగించి, ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు. మృతులను మంగోరిగూడెంకు చెందిన వారుగా గుర్తించారు. లారీ గ్రానైట్‌ లోడ్‌తో వెళ్తుండగా.. వాటికి కట్టిన తాళ్లు ఊడిపోయాయి. పక్క నుంచి వెళ్తోన్న ఆటోపై బండరాళ్లు పడిపోయాయని స్థానికులు చెబుతున్నారు. భారీ బండరాళ్లు కావడంతో మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో పలువురికి కాళ్లు, చేతులు విరిగాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే మితిమీరిన వేగం, సరిగా రాళ్లను కట్టకపోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. లారీ మహబూబాబాద్‌ నుంచి మరిపెడకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్రేన్‌ సహాయంతో బండరాళ్లను తొలగించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గాయపడ్డ నలుగురికి మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


గుజరాత్ లో ఘోర ప్రమాదం 


గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే 48పై నవశ్రీ ప్రాంతంలో ఓ బస్సు, కారు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. నవశ్రీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి 11 మందిని తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. మిగతా 17 మందిని వల్సద్‌లోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని సూరత్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం తరవాత బస్ డ్రైవర్‌కు హార్ట్ అటాక్ వచ్చిందని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. బస్‌లోని ప్రయాణికులంతా అహ్మదాబాద్‌లో ఓ వేడుకలకు హాజరైన తరవాత వల్సాద్‌కు తిరిగి వస్తున్నారు. రేష్మ గ్రామం వద్ద ఓ కార్‌ని ఢీకొట్టింది.