TS SSC Exams : పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఆరు పేపర్లే ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఆరు పేపర్లకు కుదిస్తూ శనివారం జీవో జారీచేసింది. ఇప్పటి వరకూ పదో తరగతి వార్షిక పరీక్షలను 11 పేపర్లతో నిర్వహించేవారు. అయితే కరోనా టైంలో వీటిని 6 పేపర్లకు కుదించారు. కరోనా క్రమంగా తగ్గడంతో  ప్రస్తుత విద్యా సంవత్సరం కూడా సాఫీగానే సాగుతోంది. దీంతో మళ్లీ పాత విధానం అమలవుతుందని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం మాత్రం 100 శాతం సిలబస్ తో ఆరు పేపర్ల విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులపై భారాన్ని తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో ఏప్రిల్‌ 3 నుంచి పది పరీక్షలు నిర్వహించనున్నారు. 

పరీక్షల షెడ్యూల్ 

తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూలును ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూలు ప్రకారం 2023 ఏప్రిల్ 3న ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు, 13న ఒకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లిష్, 8న మ్యాథమెటిక్స్, 10న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.

పరీక్ష తేదీ పేపరు

  • ఏప్రిల్ 3 -ఫస్ట్ లాంగ్వేజ్
  • ఏప్రిల్ 4 -సెకండ్ లాంగ్వేజ్
  • ఏప్రిల్ 6 -ఇంగ్లిష్
  • ఏప్రిల్ 8 -మ్యాథమెటిక్స్
  • ఏప్రిల్ 10 -సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ)
  • ఏప్రిల్ 11 -సోషల్
  • ఏప్రిల్ 12 -ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు
  • ఏప్రిల్ 13 -ఓరియంటెల్ పేపర్-2

ఏపీ పది పరీక్షల షెడ్యూల్

ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటించింది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీలో 6 పేపర్లతో పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త విధానం ప్రకారం పది పరీక్షల మాదిరి ప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్‌, ప్రశ్నల వారీగా వెయిటేజీ వివరాలను బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంచింది. 

పరీక్షల షెడ్యూలు ఇలా..

పరీక్ష తేదీ పేపరు
ఏప్రిల్ 3 ఫస్ట్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6 సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 8 ఇంగ్లిష్
ఏప్రిల్ 10 మ్యాథమెటిక్స్
ఏప్రిల్ 13 సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ)
ఏప్రిల్ 15 సోషల్ స్టడీస్
ఏప్రిల్ 17 కాంపోజిట్ కోర్సు
ఏప్రిల్ 18 ఒకేషనల్ కోర్సు