Low Pressure Likely Over Bay Of Bengal In 24 Hours: ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న వేడిగాలుతో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం పొడిగా మారింది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు వేర్వేరు ప్రకటనల్లో హెచ్చరించాయి. మరోవైపు దక్షిణ బంగాళాఖాతంలో మార్చి 16న అల్పపీడనం ఏర్పడింది. 


ఈ అల్పపీడనం క్రమంగా తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముంద్రం మీదుగా కేంద్రంగా ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతూ 19వ తేదీన తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ అల్పపీడనం మరింతగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో మార్చి 20న వాయుగుండంగా మారి, మార్చి 21న తుఫాన్‌గా తీవ్ర రూపం దాల్చనుంది. ఆ తరువాత ఉత్తర ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. మార్చి 22 ఉదయం నాటికి బంగ్లాదేశ్, దానిని అనుకుని ఉన్న ఉత్తర మయన్మార్ తీరానికి మార్చి 23న చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి గాలులు వీస్తున్నాయి.


ఉత్తర కోస్తాంధ్ర యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మధ్యాహ్నం ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖ నగరంలో ఉక్కపోత మరింత ఎక్కువైంది.  విజయవాడతో పాటుగా రాజమండ్రి, ఏలూరు కేంద్రాల్లోనూ పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటడంతో ఉక్కపోత అధికం కానుంది. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఎండ వేడి కొనసాగుతోందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వీస్తున్న పొడిగాలుల వల్ల గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకానుంది. విశాఖ నగరంలో ఐతే ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఎప్పుడులేని విధంగా 41 డిగ్రీలు నమోదవుతోంది. 


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
నేటి నుంచి రెండు రోజులపాటు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణం పొడిగా మారుతుంది. కొన్నిచోట్ల వడగాల్పులు వీచడంతో ఉక్కపోత అధికం. ప్రజలు వేడిని తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వాతావరణ కేంద్రం పేర్కొంది.నెల్లూరు, ప్రకాశం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎండల ప్రభావం అధికం. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్తే గొడుగు తీసుకెళ్లాలని, కొబ్బరి బొండాలు, పళ్ల రసాలు తాగడం ద్వారా డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారని అధికారులు పేర్కొన్నారు. రోజుకు కనీసం 5 లీటర్ల వరకు మంచి నీళ్లు తాగాలని అధికారులు సూచించారు. 






తెలంగాణ వెదర్ అప్‌డేట్ (Temperature in Telangana)
అల్పపీడనం మరో రెండు రోజుల్లో తెలంగాణపై ప్రభావం చూపుతుంది. మరోవైపు తూర్పు తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మిర్యాలగూడలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాడిపోవడంతో వాతావరణంలో ఉక్కపోత ఎక్కువైంది. రాష్ట్రంలో వేడి, ఉక్కపోత రోజురోజుకూ పెరిగిపోతోంది. సూర్యాపేట​, మహబూబాబాద్, నల్గొండ​, భద్రాద్రి, ములుగు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల​, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.