Leopard Telugu News: నారాయణపేట: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల రెండు పులులు మృతిచెందిన ఘటన మరువక ముందే మరోచోట చిరుత పులులు నారాయణపేట జిల్లాల్లో పొలంలోకి రావడం కలకలం రేపింది. కానీ గ్రామస్తుల హడావుడి, అరుపులు చూసి భయంతో చిరుతలు పరారయ్యాయంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.


నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం వత్తు గుండ్ల, కంసాన్ పల్లి గ్రామాల మధ్య ఉన్న గట్టు ప్రాంతంలో చిరుతలు కనిపించాయి. ఓ వ్యవసాయ భూమి వద్ద శనివారం సాయంత్రం  సమయంలో మూడు చిరుతలు మొదటగా రైతులకు కనిపించాయి. మూడు చిరుతల్లో ఓ పెద్ద చిరుత, రెండు పిల్ల చిరుతలు ఉన్నాయి. అయితే పొలం గట్లపై పెద్ద చిరుత నెమ్మదిగా తిరుగుతుండటం గమనించారు. ఆపై వాటిని ఫొటోలు తీస్తూ సమీపానికి వెళ్లినా ప్రజలపై ఎలాంటి దాడి చేయలేదు. స్థానికులు వాటి వద్దకు వెళ్లినా ఆ చిరుత తమకేమీ పట్టనట్లుగా వెళ్తూ కనిపించింది. విషయం తెలిసిన స్థానికులు చాలా మంది అక్కడికి చేరుకుని చిరుతలతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. కొందరు తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించినట్లు తెలుస్తోంది. చిరుతలు ఎక్కడి నుంచి వచ్చాయి అనే దానిపై అధికారులకు స్పష్టత రావాల్సి ఉంది.


తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్,  తెలంగాణలో గత రెండేళ్లుగా వన్య మృగాలు గ్రామాల్లోకి రావడం అధికమైంది. ఏపీలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, శ్రీకాకుళం, చిత్తూ జిల్లాల్లో పలు చోట్ల చిరుతలు, ఎలుగుబంట్లు, పులులు, ఏనుగుల సంచారంతో ప్రజలు హడలెత్తి పోయిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఏనుగులు, ఎలుగుబంట్ల దాడిలో మరణాలు సైతం సంభవించాయి. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ములుగు జిల్లాలో ఒకట్రెండు చోట్ల వన్య ప్రాణులు గ్రామాల్లోకి వచ్చిన ఘటనల గురించి అప్పుడప్పుడూ వింటుంటాం. కానీ ఈ వారం కాగజ్ నగర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండు పులులు విష ప్రయోగంతో చనిపోవడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.