Disha Encounter Case Latest News: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఓ కట్టుకథలా ఉందని సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చేసింది. మరి ఎన్‌కౌంటర్ గురించి పోలీసులు చెప్పింది కట్టుకథ అయితే.. అసలు నిజం ఏంటనే వాదనలు వస్తున్నాయి. పోలీసుల వాంగ్మూలంలో తప్పులున్నాయని చెప్పిన కమిషన్.. వాస్తవంగా ఏం జరిగిందో చెప్పడంలో విఫలం అయిందని పోలీసుల తరఫు వాదించిన న్యాయవాది కోట కీర్తి కిరణ్ అంటున్నారు.  


మూడేళ్ల కిందట హైదరాబాద్ సమీపంలో జరిగిన దిశ అత్యాచారం, హత్య అప్పట్లో కలకలం రేపింది. అయితే ఆ తర్వాత వారం రోజులకే ఆ హత్యాచారం కేసులో నిందితులకు సంబంధించిన ఎన్ కౌంటర్ కూడా అంతే సంచలనంగా మారింది. అయితే, ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని, ఎన్ కౌంటర్ కు సంబంధించి పోలీసులు చెబుతున్న విషయాలు ఏవీ నమ్మదగ్గేవిగా లేవని దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సిర్పూర్కూర్ కమిషన్ పేర్కొంది.


ఈ ఘటనతో సంబంధం ఉన్న 10 మంది పోలీసులపై హత్య కేసులు నమోదు చేయాలని కూడా నివేదికలో పొందుపరిచారు. జరిగిన ఘటనపై నిజనిర్దారణ చేయడానికి ఏర్పాటైన విచారణ కమిషన్- "నిజాన్ని" కనుక్కోవడంలో మాత్రం విఫలం అయిందని అన్నారు. పోలీసులు చెప్పిన దాంట్లో తప్పులు ఉన్నాయని భావించినప్పుడు... జరిగిన నిజం ఏంటో కూడా వాళ్లు చెప్పాల్సి ఉందన్నారు. ఏబీపీ దేశంతో మాట్లాడిన ఆయన... "సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ నివేదికను పరిగణనలోకి తీసుకోలేదు. సింపుల్‌ గా చెప్పాలంటే.. కేసును హైకోర్టుకు ట్రాన్స్ ఫర్ చేసి.. ఈ నివేదికపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని హైకోర్టుకు అప్పగించింది.


ఇంకో విషయం ఏంటంటే.. సిర్పూర్కర్ కమిషన్ నిజనిర్థారణ కోసం ఏర్పడింది. దిశ నిందితుల ఎన్‌ కౌంటర్ విషయంలో పోలీసులు చెప్పిన విషయాల్లో లోపాలు ఉన్నాయని చెప్పారే తప్ప.. వాస్తవంగా ఏం జరిగిందన్నది రిపోర్టులో చెప్పలేదు. పోలీసు వెర్షన్ లో లోపాలు అంటున్నారు కానీ.. వాస్తవంగా ఏం జరిగిందో చెప్పాలి కదా.." అంటున్నారు. ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలోని బృందం పోలీసుల తీరును తప్పుపడతూ.. వారిని ప్రాసిక్యూట్ చేయాలని సూచించడం దేనికి సూచిక అని ప్రశ్నించినప్పుడు.. "లీగల్ గా రిపోర్టును కోర్టులో టెస్టు చేసేవరకూ.. నివేదికకు వాలిడిటీ ఉండదు. ఇప్పటి వరకూ అది జరగలేదు. రేపు హైకోర్టులో రిపోర్టుపై విచారణ జరిగి కోర్టు నిర్ణయం తీసుకునే వరకూ.. న్యాయపరమైన విలువ ఉండదు. " అన్నారు. 



కమిషన్ ను తప్పు పట్టే ఉద్దేశ్యం లేదని.. అయితే కొన్ని విషయాలను కమిషన్ సరిగ్గా గుర్తించలేకపోయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్‌ కౌంటర్‌లో చనిపోయిన వారు ముగ్గురు మైనర్లు అని చెప్పడమే అందుకు ఉదాహరణ అని అన్నారు. హతులకు సంబంధించిన స్కూల్ రికార్డుల్లో చాలా వరకూ మార్పులు జరిగిన ఆధారాలున్నాయన్నారు. ప్రిజన్ రికార్డులు, ఆధార్ కార్డుల ప్రకారం అంతా మేజర్‌ లే అన్నారు. వాటిని కమిషన్ పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఇక బయట ప్రచారం జరుగుతున్నట్లుగా.. సీన్ రీ కనస్ట్రక్షన్ చేస్తుండగా.. ఎన్ కౌంటర్ జరగలేదని.. మృతురాలికి సంబంధించిన వస్తువులను రికవరీ చేసేందుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందన్నారు. మొత్తం మీద చూస్తే.. ఈ కమిషన్ కూడా పోలీసులు చెబుతున్న అంశాల్లో లోపాలు ఉన్నాయని చెప్పిందే తప్ప.. జరిగిన ఘటన అలా జరగలేదని ఎక్కడా చెప్పలేదన్నారు. ఒకవేళ అదే నిజమనుకుంటే.. "అసలు ఏం జరిగింది..?" అన్నది కమిషన్ నిర్థారించి ఉండేది  అన్నారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టుకు వస్తుందని.. అక్కడ ఈ విషయాలను ప్రస్తావిస్తామన్నారు. 



2019 నవంబర్ 28 రాత్రి హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద వెటర్నరీ డాక్టర్ దిశ కనిపించకుండా పోయారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తన సోదరితో మాట్లాడిన ఆమె.. ఆ తర్వాత మిస్ అయ్యారు. ఆ తెల్లవారుజామున కాలుతున్న స్థితిలో ఆమె మృతదేహం దొరికింది. నిందితులు గ్యాంగ్ రేప్ చేసి ఆమెను హతమార్చారని పోలీసులు నిర్థారించారు. ఈ ఘటనతో సంబంధం ఉందని నలుగురు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అది జరిగిన వారం రోజులకు అంటే డిసెంబర్ 6న దిశ చనిపోయిన ప్రదేశానికి సమీపంలోనే వారు ఎన్ కౌంటర్‌లో చనిపోయారు. ఈ రెండు ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పోలీసులు తీరును హక్కుల కార్యకర్తలు తప్పు పట్టినా.. సామాన్య ప్రజల్లో పోలీసులకు పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. పోలీసులు చేసింది "సరైన చర్య" అంటూ బాహాటంగా రాజకీయ నాయకులు కూడా ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఆ ఎన్‌కౌంటర్ "ఫేక్" అని విచారణ కమిషన్ తేల్చింది.