Sachavalayam Employee Suicide: కొందరు మార్కులు తక్కువ వచ్చాయనో, ర్యాంకు రాలేదనో ప్రాణాలు తీసుకుంటున్నారు. సెల్‌ఫోన్ కొనివ్వలేదని కొందరు, బర్త్ డే గిఫ్ట్ రాలేదని.. ఇలా ఏదో ఓ కారణంగా జీవితాలను మధ్యలోనే బలవంతంగా ముగిస్తున్నారు. తాజాగా ఏపీకి చెందిన ఓ ఉద్యోగి తాను చదివిన చదువు వేరని, చేస్తున్న జాబ్ వేరని.. జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాననే బాధతో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వివరాలిలా ఉన్నాయి. 


గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన అశోక్ కుమార్ అనే యువకుడు అన్నవరం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అశోక్ కుమార్‌కు గత ఏడాది వివాహమైంది. ఈ క్రమంలో మే 15న పని మీద ఢిల్లీ వెళ్తున్నానని కుటుంభసభ్యులకు చెప్పాడు. వాట్సాప్​లో సమాచారం అందించాడు. అయితే ఫ్యామిలీకి చెప్పినట్లుగా అశోక్ కుమార్ ఢిల్లీకి వెళ్లకుండా  విశాఖ నగరానికి చేరుకున్నాడు. పెద రుషికొండలో ఓ గెస్ట్ హౌస్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటున్న సచివాలయ ఉద్యోగి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. 


ఇది గమనించిన గెస్ట్ హౌస్ నిర్వాహకులు పోలీసులకు అశోక్ కుమార్ ఆత్మహత్య విషయంపై సమాచారం అందించారు. అక్కిడికి వెళ్లిన పోలీసులు గెస్ట్ హౌస్ నిర్వాహకుల నుంచి అశోక్ వివరాలు సేకరించారు.  అక్కడకు  గాజువాకలో నివాసం ఉంటున్న మృతుడి మేనమామ నాగసుబ్బారావుకి పోలీసులు సమాచారం అందించారు. సచివాలయ ఉద్యోగిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


తమ్ముడికి వాట్సాప్ వాయిస్ మెసేజ్
అశోక్ కుమార్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అయితే తనకు ఐఏఎస్ కావాలని లక్ష్యం ఉండేది. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సచివాలయ ఉద్యోగికి చేరి పని చేస్తున్నాడు. కానీ తాను చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి, తన జీవిత లక్ష్యానికి ఏమాత్రం పొంతన లేవని ఆలోచిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్తున్నానని తన తమ్ముడు సురేంద్రకు తెలిపాడు. కానీ విశాఖ రిషికొండకు వచ్చి గెస్ట్ హౌస్‌లో ఉంటున్న అశోక్ ఆత్మహత్య చేసుకోవాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. తమ్ముడికి వాట్సాప్ లో వాయిస్ మెస్సేజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.


‘నేను చదివిన చదువుకు, చేస్తున్న ఉద్యోగానికి పొంతన లేదు. రుషికొండలో లాడ్జీలో ఆత్మహత్య చేసుకుంటున్నాను. కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అని’ తమ్ముడు సురేంద్రకు వాట్సాప్‌లో వాట్సాప్‌లో వాయిస్ మెస్సేజ్ చేశాడు అశోక్ కుమార్. సురేంద్ర వెంటనే పీఎం పాలెం పోలీసులకు సమాచారం అందించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఉరివేసుకుని అశోక్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వెళ్లి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు అశోక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు.  అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.


అశోక్‌కు భార్య రాజరాజేశ్వరి ఉన్నారు. ఆమె ఓ ఇంజినీరింగ్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. అశోక్ ట్రైనింగ్ కోసం మే 12న సామర్లకోట్లకు వెళ్తున్నట్లు కుటుంబానికి చెప్పి వెళ్లాడు. ఆ తరువాత కుటుంబసభ్యులకు ఫోన్ చేయలేదు. ఈ క్రమంలో తాను పని మీద ఢిల్లీకి వెళ్తున్నానని తమ్ముడు సురేంద్రకు మెస్సేజ్ చేయడంతో అతడు కుటుంబసభ్యులకు విషయం చెప్పాడు. కానీ అంతలోనే ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయామంటూ కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.