తెలంగాణ ఏర్పాటుకు ముందు ఏటా పట్టణ ప్రాంతాల్లో విలవల సవరణ, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ఉండేది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది విడిచి ఏడాది ధరల సవరణ కొనసాగేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ తరహా విధానానికి స్వస్తి పలికింది. ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి పల్లెలు, పట్టణాల్లో ఒకేసారి భూముల విలువల సవరణతోపాటు రిజిస్ట్రేషన్ చార్జీలను హేతుబద్ధీకరించింది.




పెరిగిన భూముల విలువ, స్టాంపు డ్యూటీ ప్రకారం వివిధ ప్రాంతాల్లో పెరిగిన చార్జీలు అమల్లోకి వస్తాయి. ఇంతకు ముందు వరకు ఓపెన్ ప్లాటు చదరపు గజం ప్రస్తుత మార్కెట్ విలువ 15 వేలు ఉంటే...  150 గజాలున్న ప్లాటుకు రిజిస్ట్రేషన్ చార్జీలు 1.37,250 అవుతుంది. తాజాగా పెంచిన విలువ ప్రకారం  భూమి విలువ 21,000 కు పెరిగింది. మ్యుటేషన్ ఫీజుతో కలుపుకుని రిజిస్ట్రేషన్ ఫీజు 7.5 శాతం పెరిగింది. ఈ లెక్కన మొత్తం రిజిస్ట్రేషన్ చార్జీలు 2,39,400 అవుతుంది.




గజం విలువ కనిష్ఠంగా 20 వేలు, గరిష్ఠంగా 51 వేలు ఉన్న ప్రాంతాల్లో 150 గజాలున్న ఓపెన్ ప్లాటుకు గతంలో రిజిస్ట్రేషన్ చార్జీలు కనిష్ఠ విలువ ఉన్న చోట రూ.1.83 లక్షలు, గరిష్ఠ విలువ ఉన్న చోట రూ.4,66,650 అవుతుంది. పెరిగిన విలువ ప్రకారం కనిష్ఠం 28 వేలు, గరిష్ఠం రూ. 66,500గా మారింది. దీని ప్రకారం 150 గజాల ఓపెన్ ప్లాటుకు రిజిస్ట్రేషన్ చార్జీలు కనిష్ఠం ఉన్న చోట రూ.3,19,200, గరిష్ఠం ఉన్న చోట రూ.7,58,100.




ఓపెన్ ప్లాటు చదరపు గజం విలువ రూ.12 వేలు, గరిష్ఠం రూ.65 వేలు ఉన్న ప్రాంతాల్లో  150 గజాలున్న ఓపెన్ ప్లా టుకు రిజిస్ట్రేషన్ చార్జీలు కనిష్ఠం ఉన్న చోట రూ.1,09,800, గరిష్ఠం ఉన్నచోట రూ.5,94,750 అవుతుంది. తాజా పెంపు ప్రకారం కనిష్ఠం రూ.17 వేలు, గరిష్ఠం రూ.84,500 అయింది. దీంతో కనిష్ఠం ఉన్న చోట రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.1,93,800, గరిష్ఠం ఉన్న చోట రూ.9,63,300 అవుతుంది.




ఓపెన్ ప్లాటు చదరపు గజానికి కనిష్ఠంగా రూ.9 వేలు, గరిష్ఠంగా రూ.30 వేలు ఉన్న చోట రిజిస్ట్రేషన్ చార్జీలు కనిష్ఠం ఉన్న ప్రాంతాల్లో 150 గజాల ప్లాటుకు రూ.82,350, గరిష్ఠం ఉన్న చోట రూ.2,74,500 అవుతుంది. పెరిగిన ధర ప్రకారం భూముల విలువ కనిష్ఠంగా రూ.13,500, గరిష్ఠంగా రూ.39వేలు అయింది. కనిష్ఠం ఉన్న చోట రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.1,53,900, గరిష్ఠం ఉన్న ప్రాంతాల్లో రూ.4,44,600 ముట్టచెప్పాల్సిందే.


ఓపెన్ ప్లాటు చదరపు గజానికి కనిష్ఠంగా మార్కెట్ విలువ రూ.1500, గరిష్ఠంగా  రూ.15 వేలుగా  ఉన్న ప్రాంతాల్లో 150 గజాలున్న ఓపెన్ ప్లాటుకు రిజిస్ట్రేషన్ చార్జీలు  రూ.1,37,250 అయ్యేది. పెరిగిన విలువ ప్రకారం రూ.2,39,400 అవుతుంది.  రిజిస్ట్రేషన్ చార్జీలను 6 నుంచి 7.5 శాతానికి పెంచింది. పొరుగున ఉన్న తమిళనాడులో 11శాతం, కేరళలో 10శాతం, ఆంధ్రప్రదేశ్లో 7.5శాతం చొప్పున రిజిస్ట్రేషన్ చార్జీలు అమల్లో ఉన్నాయి.




మీరు ఇల్లు కానీ పొలం కాని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే.. అక్కడి మార్కెట్ వాల్యూని తెలుసుకోండి. దానికి తగ్గట్లుగా రిజిస్ట్రేషన్ ఫీజ ఎంత అవుతుందో.. సులువుగా కాలిక్యులేట్ చేసుకోవచ్చు.