లోక్‌సభలో మాట్లాడే ఛాన్స్ కోసం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఓ వైపు స్పీకర్ ఓంబిర్లాకు పదే పదే విజ్ఞాపనపత్రాలు సమర్పించారు. మరో వైపు అమిత్ షాతో జరిగిన భేటీలోనూ.. తనకు జరిగిన అన్యాయాన్ని సభలో చెప్పుకునే అవకాశం కల్పించాలని కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. సభను స్తంభింపచేయడానికైనా సిద్ధమే కానీ.. రఘురామను మాత్రం మాట్లాడనీయబోమన్న వ్యూహాన్ని వైసీపీ ..ఎంపీలు అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతకూ రఘురామకృష్ణరాజు.. సభలో ఐదు నిమిషాలు మాట్లాడితే ఏమవుతుంది..?  వైసీపీ ఎందుకు కంగారు పడుతోంది..? మాట్లాడకుండా సభను సైతం స్తంభింపచేస్తామని ఎందుకు చెబుతున్నారు..?. ఇవే అసలు సందేహాలు. ఆయన మాట్లాడాల్సినవన్నీ రోజూ మాట్లాడుతున్నారు. కొత్తగా మాట్లాడటానికి ఏమీ ఉండదు. మరి ఎందుకు భయపడుతున్నారు..?


రఘురామకృష్ణరాజు మంచి స్పీకర్ . ఈ విషయంలో ఎలాంటి సందేహ లేదు. చెప్పాలనుకున్నదాన్ని సూటిగా చెబుతారు. ఏ అంశాన్ని ఎలా చెప్పాలో కూడా ఆయనకు బాగా తెలుసు. తనపై సీఐడీ పెట్టిన రాజద్రోహం కేసు... ఆ తర్వాత సీఐడీ అధికారులు తనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని  ఆయన ఏ మాత్రం తేలికగా తీసుకోవడం లేదు. ఆత్మాభిమానంతో కొట్టిన విషయాన్ని బయటకు చెప్పుకోరని సీఐడీ పోలీసులు అనుకున్నారేమో కానీ.. ఆయన మాత్రం.. ఎదురు తిరిగి పోరాటం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనను ఎలా ఇబ్బందులు పెట్టిందో..  వాటన్నింటినీ దేశం మొత్తం తెలిసేలా చేయగలిగారు. 


తనకు బెయిల్ లభించి ఢిల్లీకి వెళ్లిన తర్వాత నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారందరికీ లేఖలు రాశారు. ముందుగా తోటి పార్లమెంట్ సభ్యులందరికీ లేఖలు రాశారు. ఏపీ సీఎం ప్రోద్భలంతో ఏపీలో తనపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని అందులో వివరించారు. అసలేం జరిగిందో.. సీఎం ఎలాంటి కుట్రలు చేస్తున్నారో...  రఘురామకృష్ణరాజు లేఖలో వివరించారు. ఆ తర్వాత చాలా మంది ఎంపీలు.. రఘురామ లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. ఏపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. అదే తరహా లేఖలను తర్వాత గవర్నర్లకు రాశారు. కేంద్రమంత్రులకు రాశారు. చివరికి రాష్ట్రపతికి కూడా పంపించారు. చెప్పాల్సిన వాళ్లందరికీ చెప్పేశారు. ఇప్పుడు ఆయన దృష్టి లోక్‌సభపై పడింది. 
 
లోక్‌సభ జీరో అవర్‌లోనూ తనపై నమోదవుతున్న కేసుల అంశాన్ని రఘురామకృష్ణరాజు ప్రస్తావించాలని గతంలోనే నిర్ణయించారు. ప్రత్యక్షంగా కూడా సభలో సభ్యులందరికీ పరిస్థితిని వివరిస్తాననని చెబుతూ వస్తున్నారు.  నిజంగా ఆయనకు జీవో అవర్‌లో మాట్లాడే పరిస్థితి వస్తే..  మొత్తం వ్యవహారం రికార్డులకు ఎక్కుతుంది. ఇప్పటికే.. రఘురామపై దాడి వ్యవహారం..  హ్యూమన్ రైట్స్ కమిష‌న్ సహా.. సుప్రీంకోర్టు వరకూ..అన్ని చోట్లా విచారణలో ఉంది. ఇలాంటి సందర్భాల్లో పార్లమెంట్‌ చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వస్తే ఏపీ ప్రభుత్వ ఇమేజ్ మరింత దిగజారిపోతుంది. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా.. సొంత పార్టీ ఎంపీని దారుణంగా హింసించిన ముద్ర వైసీపీ మీద.. జగన్మోహన్ రెడ్డి పైన పడుతుంది.