Kagaznagar Minority School : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మైనారిటీ గురుకుల పాఠశాల వద్ద ఆందోళన కొనసాగుతోంది. సోమవారం రాత్రి సుమారు 45 మంది విద్యార్థులు భోజనం వికటించి అస్వస్థతకు గురవడంతో వారిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఆసిఫాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మంగళవారం ఉదయం మైనారిటీ గురుకుల పాఠశాలను పరిశీలించారు. 


గురుకల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 


కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి 45 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. పురుగుల అన్నంతో పాటు ఉడికీ ఉడకని అన్నం తిని విద్యార్థులకు పెట్టడం వల్లే అస్వస్థతకు గురయ్యారని, అయినా పాఠశాల సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమయానికి మీడియా పోలీసులు రావడంతోనే విషయం బయటపడి వారిని పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారన్నారు. లేదంటే తమ పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించిన మైనారిటీ గురుకుల పాఠశాల సిబ్బందిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


అదనపు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న తల్లిదండ్రులు 
 
కాగజ్‌నగర్‌ మైనారిటీ గురుకులం విద్యార్థులు  అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ కాగజ్‌నగర్‌ మైనారిటీ గురుకుల పాఠశాలను పరిశీలించారు. గురుకులంలోని వంట గదిని, సామాన్లను పరిశీలించారు. కుళ్లిన పండ్లు, ఉడికీ ఉడకని అన్నంతో పాటు భోజనాన్ని గుర్తించారు. అనంతరం అదనపు కలెక్టర్ బయటికి వెళుతుండగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, ఏబీవీపీ నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. మైనారిటీ గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే అస్వస్థతకు గురయ్యారని, వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు అరగంట పాటు మైనారిటీ గురుకులం పాఠశాల వద్ద ఆందోళన కొనసాగింది. ఆపై అదనపు కలెక్టర్ చాహత్ భాజ్ పాయ్ ఈ విషయంపై  తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. గురుకులాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని గురుకుల విద్యార్థులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. 


విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తున్న తల్లిదండ్రులు


కాగజ్‌నగర్‌ మైనారిటీ గురుకులంలో నిన్న రాత్రి భోజనం వికటించి విధ్యార్థులు అస్వస్థతకు గురికావటంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్తున్నారు. మైనారిటీ గురుకులంలో మొత్తం 350 మంది విద్యార్థులున్నారు. ఇందులో నిన్న రాత్రి ముందుగా 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, ఆ సంఖ్య 45 వరకు చేరింది. నేడు మొత్తం 53 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లా వైద్యాధికారి డా. ప్రభాకర్ రెడ్డి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. కొలుకున్న కొంతమంది విద్యార్థులను డిశ్చార్జ్ చేశారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పలువురు విద్యార్థులను తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లిపోయారు.  


ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ 


కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మైనారిటీ గురుకులంలో సోమవారం రాత్రి 45 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం పట్ల బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ TRS ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తు ట్వీట్ చేశారు. గురుకులం విద్యార్థులు, మైనారిటీ బిడ్డలు చదువుకుంటామంటే TRS ప్రభుత్వం విషాహారం పెడుతుందని, TRS ప్రభుత్వాన్ని ఏం చేద్దాం.. అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.