KTR Whatsapp Block : తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాట్సాప్ నెంబర్ బ్లాక్ అయింది. తిరిగి అన్ లాక్ చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కావడం లేదు. తనకు కనీసం ఎనిమిది వేల మెసెజ్‌లు వచ్చాయని వాటిని చదవడానికి వీలు లేకుండా పోయిందని ఆయన అంటున్నారు. కేటీఆర్ తన వాట్సాప్ బ్లాక్ అయిన అంశంపై చూపిస్తున్న స్క్రీన్ షాట్‌ను కూడా జత చేశారు. స్పామ్ కారణంగా బ్లాక్ చేసినట్లుగా అందులో కనిపిస్తోంది. ఈ అంశంపై డిజిటల్ చాలెంజ్ హ్యాష్ ట్యాగ్ పేరుతో ట్విట్టర్‌లోకి తెచ్చారు కేటీఆర్ .
వాట్సాప్ సంస్థ ప్రతీ నెలా లక్షల మంది వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేస్తూ ఉంటుంది. వాట్సాప్ యూజర్లు ఎక్కువగా ఫార్వర్డ్ మెసేజెస్ పంపుతున్నా ...వాటిపై ఫిర్యాదులు వచ్చినా అకౌంట్‌ని వాట్సప్ బ్లాక్ చేస్తుంది. ఎక్కువ మంది వాట్సప్‌లో బ్లాక్ చేసినా మీ వాట్సప్ అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉంది. యూజర్లు వాట్సప్‌లో ఆటోమేటెడ్, బల్క్ మెసేజింగ్, స్పామ్ మెసేజింగ్ చేసినా వారి వాట్సప్ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. వాట్సప్ తాత్కాలికంగా బ్లాక్ చేస్తే అన్‌బ్లాక్ చేయొచ్చు. బ్లాక్ అయిన మీ వాట్సప్ అకౌంట్‌ను రీస్టోర్ చేయాలంటే వాట్సప్ సపోర్ట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. కేటీఆర్ కూడా ఇప్పటికి రెండు సార్లు అలా సంప్రదించి అకౌంట్ రికవర్ చేసుకున్నా.. మూడో సారి కూడా బ్లాక్ అయినట్లుగా తెలుస్తోంది.
కేటీఆర్ ప్రభుత్వంలో కీలక వ్యక్తి. ఆయనకు వివిధ రకాలుగా కీలకమైన సమాచారం వాట్సాప్ ద్వారానే వస్తుంది. అందుబాటులో ఉన్న అత్యుత్తమ మెసెజింగ్ యాప్ అదే. ఈ కారణంగా వాట్సాప్ అందరికీ కీలకం అయింది. అందుకే ఇలాంటి సందర్భాల్లో వాట్సాప్ బ్లాక్ అయితే ఎవరికైనా ఇబ్బందికరంగానే ఉంటుంది. కేటీఆర్‌కు ఎమర్జెన్సీ రెస్పాండ్ అవ్వాల్సిన మెసెజులు కూడా వస్తాయి కాబట్టి ఆయనకు మరింత ఇబ్బందికరమే.
కాలికి దెబ్బతగలడంతో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు కేటీఆర్. అయితే వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. తాను ఫైల్‌స్ చూస్తున్న విషయాన్ని ట్విట్టర్‌లో ఫోటో తో సహా పెట్టారు.
]