KA Paul : ప్రజా శాంతి‌పార్టీలో చేరేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆసక్తి చూపుతున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రధాని మోదీ ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉందని కేఏ పాల్ ఆరోపించారు. ఈవీఎం పద్ధతిలో ఓటింగ్ వద్దని, బ్యాలెట్ విధానమే సరైందన్నారు. ఈసారి ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమ‌న్నారు. బీజేపీ విధానాలతో దేశం మరో శ్రీలంక లాగా మారుతుందన్నారు. విజ‌య‌వాడ‌లో కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికలలో మార్పు కోసం ప్రజలంతా కలిసి రావాలన్నారు.


న్యాయవ్యవస్థపై దాడి 


పాలకులు మీడియాను భయపెడుతున్నారని కేఏ పాల్ ఆరోపించారు. అదానీ లాంటి వాళ్లు మీడియాను కొనేస్తున్నారన్నారు. వినకపోతే చంపే‌వరకూ వెళుతున్నారన్నారు. అంతు చూస్తామని కొంతమంది రాజకీయ నాయకులు మీడియాను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం  చనిపోతుందని ముందే చెప్పానని, ఇప్పుడు అదే జరిగిందన్నారు. న్యాయ వ్యవస్థపై కూడా నలుగురు న్యాయమూర్తులు బయటకి వచ్చి మాట్లాడారన్నారు. కొంతమంది న్యాయ మూర్తులను రాజకీయ నేతలు బెదించే స్థాయికి వచ్చారన్నారు. ఈసారి మళ్లీ ఈవీఎంలు వినియోగిస్తే బీజేపీకి‌ 300 సీట్లు వస్తాయన్నారు.  అందుకే బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. 



మీడియాపై ఒత్తిళ్లు 


"ప్రజాశాంతి‌పార్టీలో చేరేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆసక్తి చూపుతున్నారు. నేషనల్ మీడియా రాజకీయనేతల ఒత్తిళ్లకు లొంగిపోయింది. తెలుగు మీడియా భయపడకుండా వార్తలు ఇస్తున్నారు. అటువంటి టీవీ, పేపర్ యజమానులకు అభినందనలు. మోదీ ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారు. ఏపీకి ఎనిమిది లక్షల కోట్లు అప్పు ఉంది. ఇప్పుడు రూపాయి పుట్టే పరిస్థితి లేదు. తెలంగాణకు ఐదు కోట్ల అప్పు ఉంది. ఏం చేశారో తెలియదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ, కుల, కుట్ర రాజకీయాలకు చరమ గీతం పాడాలి. ఈ దేశం మరో శ్రీలంక లాగా మారుతుంది. మోదీ 76 లక్షల కోట్లు అప్పు చేశారు.  ఆరు నెలల్లోనే దేశం నాశనం‌ కాబోతుంది. దేశ ఆర్థిక పరిస్థితి గమనించి ఇప్పటికైనా సరిదిద్దాలి."-కేఏ పాల్, ప్రజాశాంతి అధ్యక్షుడు 


నేనంటే పవన్ కు గౌరవం  


'రాష్ట్ర విభజన బిల్లులో అంశాలను ఇప్పటికీ అమలు చేయలేదు. మాజీ సీఎం చంద్రబాబు నేను చెప్పిన సలహాలను పట్టించుకోలేదు. ఆయన ప్రధాని కావడానికి, లోకేశ్ ను సీఎం చేయడానికి రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఐదేళ్లలో రాజధాని కట్టలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. మోదీ చేసిన అన్యాయాన్ని ప్రశ్నించలేదు. చంద్రబాబుకు వయసు మళ్లింది ఇప్పుడయినా నాకు మద్దతు ఇవ్వండి. నేను ఐదేళ్లల్లో అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తా. చంద్రబాబు, జగన్, నేను ముగ్గురం ఒకే వేదిక పై చర్చకు సిద్ధం. ఏపీలో  టీడీపీ భూస్థాపితం కావడం ఖాయం. నాకు చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ లు శత్రువులు కాదు. కానీ పవన్ కల్యాణ్ పొత్తులతో పార్టీలు మారుస్తూ వస్తున్నారు. ఈ అన్నయ్యతో కలువు నీకు అంతా మంచి జరుగుతుంది. దశావతారాలు వద్దు. నేనంటే పవన్ కు గౌరవం. తమ్ముడు ముందుకు వస్తే కలిసి పనిచేస్తాం.- కేఏ పాల్, ప్రజాశాంతి అధ్యక్షుడు