KTR Review : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు సమీక్ష నిర్వహించారు.   రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలను గౌరవ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని.. పురపాలక శాఖ అధికారులతోనూ కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారని తెలిపారు. ల హైదరాబాద్ నగరంలోనూ జిహెచ్ఎంసి కమిషనర్ మరియు ఇతర ఉన్నతాధికారులు... క్షేత్రస్థాయిలో ఉన్న కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ పనిచేస్తున్నారు.  పురపాలక ఉద్యోగుల అన్ని సెలవులను రద్దు చేయడం జరిగింది.  పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా ఇతర మాధ్యమాల ద్వారా సమీక్షిస్తున్నామన్నారు.  కుంభవృష్టిగా వర్షం పడడం ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వలన ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురవుతున్నదని తెలిపారు.  


ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణా నష్టం జరగకుండా సాధ్యమైనని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.  ప్రధాన లక్ష్యం ప్రాణ నష్టం జరగకుండా చూడడమేనని..  హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందన్నారు. హైదరాబాద్ నగరంలో డిసిల్టింగ్ కార్యక్రమాన్ని ఎప్పుడో పూర్తి చేశామని..  దీంతోపాటు చెరువుల బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాము. 135 చెరువులకు గేట్లు బిగించామన్నారు.  డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు అధికారులు సిబ్బంది కూడా విస్తృతంగా పనిచేస్తున్నారని స్పష్టం చేశారు.  గతంలో ఇలాంటి భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేది. అయితే ఈసారి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గిందని సంతృప్తి వ్యక్తం చేశారు. 


గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆయా ప్రాంతాల్లో వరద సమస్య బాగా తగ్గింది .. ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సిబ్బంది 24 గంటలు ఈ భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు పనిచేస్తుందన్నారు.  ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాని... భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు.  భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం  దెబ్బతీసే విధంగా చిల్లర విమర్శలు చేయవద్దన్నారు.  ప్రభుత్వంలోని అన్ని శాఖలు వర్షాన్ని ఎదుర్కొనేందుకు పనిచేస్తున్నాయి వారి మనో ధైర్యం దెబ్బతినకుండా నాయకులు మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు.  వరద పెరిగే ప్రాంతాల్లో ఉన్న పౌరులను అలర్ట్ చేస్తున్నామని..  ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.  చెరువులకు గండి పడే ప్రమాదం ఉంటే వాటిని కూడా సమీక్షిస్తున్నామన్నారు.  వరంగల్ నగరానికి వెళ్లాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించాము. అవసరమైతే రేపు నేను కూడా స్వయంగా వెళ్తానన్నారు.  


హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో  కేటీఆర్ పర్యటించారు. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. ల ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రాథమిక ప్రాధాన్యతగా  పని చేయాలని సూచించారు.  లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపైన అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. శిథిల భవనాల నుంచి జనాలను వెంటనే తరలించాలన్నారు.