KTR Tweet on Interim Budget 2024: మధ్యంతర బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండిచేయి చూపించిందని బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించలేదని మండిపడ్డారు. బీజేపీకి (BJP) వ్యతిరేకంగా సీఎం ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. 'తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు.?. రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు పణంగా పెడుతున్నారు?. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు.' అని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో నిధులు ఏమీ కేటాయించలేదు' అంటూ ఓ పోస్టర్ ను షేర్ చేశారు.






'కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు'


కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని.. బీజేపీని ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్ల సాధ్యమయ్యే పని కాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.  కాంగ్రెస్ పార్టీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి డబ్బుంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని, కాంగ్రెస్ పార్టీ తనకున్న 40 స్థానాలను కూడా ఈసారి నిలబెట్టుకునే అవకాశం లేదంటూ కాంగ్రెస్ పై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని తెలిపారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి వల్లే ఇండియా కూటమి చెల్లాచెదురు అవుతుందని.. ఏఐసీసీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. నిజానికి బీజేపీని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉందని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీ అధినేతలు, పలు రాష్ట్రాల సీఎంలు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వంటి బలమైన నాయకులే దేశంలో బీజేపీని అడ్డుకోగలరని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. గుజరాత్, యూపీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బీజేపీతో నేరుగా పోటీ పడాల్సిన కాంగ్రెస్, ఆ రాష్ట్రాలను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పోటీ పడుతుందని ఎద్దేవా చేశారు. ఈ తీరు వల్ల బీజేపీకి లాభం చేకూరుతుందని.. ఇండియా కూటమిలోని పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని అన్నారు.






Also Read: Kavitha comments on Revanth : ప్రియాంక వస్తే నల్లబెలూన్లు ఎగరేస్తాం - ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక