KTR :  గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారన్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. కామారెడ్డిలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.  కామారెడ్డి నియోజకవర్గం ఉద్యమ స్ఫూర్తిని తెచ్చిందన్నారు. నాడు గంప గోవర్ధన్ పార్టీలోకి రావడంతో బీఆర్ఎస్ బలం మరింతగా పెరిగిందన్నారు.  కామారెడ్డి నుంచి పోటీ చేయమని కేసీఆర్‌ను గంప గోవర్ధన్ అడుగుతారని తాను భావించలేదని, ఇప్పటికే అభివృద్ధితో ముందుకు సాగుతోన్న ఈ నియోజకవర్గం రాష్ట్రంలో నెంబర్ వన్ చేయాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఇక్కడి నుంచి బరిలోకి దిగాలని ఆయన కోరినట్లు చెప్పారు. 


కేటీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా బలమైన కారణం


కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక బలమైన ఆశయం ఉంటుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.  కేసీఆర్ పై పోటీ అంటే పోచమ్మ గుడిముందు పొట్టేలను కట్టేసినట్టేనని  కామారెడ్డిలో కేసీఆర్ పోటీ ప్రకటన రాగానే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని వ్యాఖ్యానించారు. కామారెడ్డిలో కొడితే ప్రతిపక్షాల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలని చెప్పారు. ఇక్కడ కేసీఆర్ గెలుపు ఖాయమైంది.. తేలాల్సింది మెజార్టీయేనని వ్యాఖ్యానించారు.  ఈ ఎన్నికతో దక్షిణ భారతదేశంలోనే సీఎం కేసీఆర్ సరికొత్త రికార్డు సృష్టిస్తారని పేర్కొన్నారు. నెర్రెలు బారిన నేలలో పచ్చని పంటలు పండించాలన్నదే కేసీఆర్ ధ్యేయమని తెలిపారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా బలమైన ఆశయం.. ధృడమైన సంకల్పం ఉంటుందని అన్నారు. 


కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు కాదు..తేలాల్సింది మెజార్టీనే 


కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీపై దేశమంతా ఆసక్తి చూపుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ను కామారెడ్డి ప్రజలు గుండెల నిండుగా ఆశీర్వదించాలని కోరారు. 8 మండలాల్లో స్థానిక ఎన్నికల్లో క్లాన్ స్వీప్ చేశామన్నారు. దక్షణ భారతదేశంలోనే హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నారని తెలిపారు.  జలసాధన ఉద్యమానికి సీఎం కేసీఆర్ కామారెడ్డిలో శ్రీకారం చుట్టారని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి నిధుల సేకరణకు కామారెడ్డిలోనే ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ప్రతీ నాయకుడు స్థానిక బూత్ లో మెజార్టీకి కృషి చేయాలని ఆయన కోరారు. ప్రతి గ్రామం, వార్డులో మేనిఫెస్టో తయారు చేయాలని చెప్పారు. అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు.  


ఫ్లెక్సీల్లో కనిపించని గంప గోవర్ధన్ ఫోటో  


 కామారెడ్డిలో మంత్రి కేటీఆర్ టూర్ కు ముందు నేతల వర్గపోరు బయట పడ్డింది. కేటీఆర్ కు వెల్ కం చెబుతూ నగరంలో మున్సిపల్ చైర్ పర్సన్, జిల్లా అధ్యక్షుల ఫ్లెక్సీలు పెట్టారు. ఈ ఫ్లెక్సీల్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఫోటో పెట్టలేదు. స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై గంప గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే వర్గీయులు మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు. గంప గోవర్థన్ ఇక ఎమ్మెల్యే కారని తెలియడంతో ఆయన అనుచరులు కూడా పట్టించుకోవడం లేదు.