KTR : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఎన్టీఆర్‌ ఆరాధ్య దైవమని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌ బండ్‌పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ పార్క్‌ సహా విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తో కలిసి కేటీఆర్‌ ఆవిష్కరించారు.  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో ఆప్తుడు విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు అన్నారు.  ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నాయకుడని... రాముడు ఎలా ఉంటాడో తెలియదు.. కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు.. మాకు రాముడైనా, కృష్ణుడైనా ఆయనేనన్నారు.   భారత దేశంలో తెలుగు వారంటూ ఉన్నారని గుర్తించేలా చేసింది ఎన్టీఆరేనని గుర్తు చేసుకున్నారు.                                                 


చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం నా అదృష్టం. నాకు తారక రామారావు పేరు ఉండటం చాలా సంతోషంగా ఉంది. తారక రామారావు పేరులోనే పవర్‌ ఉంది. ఎన్టీఆర్‌ శిష్యుడిగా కేసీఆర్‌ తెలంగాణ అస్తిత్వాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పారు. దక్షిణ భారత దేశంలో అన్న ఎన్టీఆర్‌ సహా ఇప్పటివరకూ హ్యాట్రిక్ ఎవరూ కొట్టలేదన్నారు.  ఎన్టీఆర్ పదవులకు వన్నె తెచ్చారని అన్నారు. ప్రజల్లో ఆయనకు ఉన్న పాపులారిటీ ముందు.. ఆయన అలకరించిన సీఎం పదవి చిన్నదని చెప్పుకొచ్చారు. తారక రాముడు ఆశీస్సులతో.. కేసీఆర్ ఆయన శిష్యుడిగా కేసీఆర్ రాజకీయ ప్రస్తానం ప్రారంభించారని అన్నారు.                      


ఎన్టీఆర్ ఎన్నో శిఖరాలు అధిరోహించారని.. అయితే సీఎంగా హ్యాట్రిక్ కొట్టలేదని.. ఆయన వదిలిపెట్టిన పనిని కేసీఆర్ పూర్తి చేస్తారని అన్నారు. దక్షిణ భారతదేశంలో ఏ సీఎం కూడా హ్యాటిక్ర్ కొట్టలేదని.. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేశారు. సీఎంగా కేసీఆర్ హ్యాటిక్ కొడితే.. ఎన్టీఆర్ ఆత్మ కూడా శాంతిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. 


 ఖమ్మంలోని ‘లకారం ట్యాంక్‌బండ్‌పై’ కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇందు కోసం దాదాపుగా వంద అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని రెడీ చేయించారు.  ఈ విగ్రహావిష్కరణకు ‘జూనియర్ ఎన్టీఆర్’ ‌ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉది.  అయితే  కొన్ని సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లాయి.  తాగునీటిచెరువుగా ఉన్న లకారంలో విగ్రహం ఏర్పాటుచేస్తే నీరు కాలుష్యం అవుతుందని కొందరు హైకోర్టుకు వెళ్లడంతో విగ్రహావిష్కరణ చేయవద్దని కోర్టు స్టే విధించింది. అప్పుడు విగ్రహం ఆవిష్కరణను వాయిదా వేశారు. ముందుగా అనుకున్న ప్రకారం ఎన్టీఆర్‌ విగ్రహాన్ని లకారం చెరువులో కాకుండా ఆ చెరువు పక్కనే ఉన్న ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు.