India Canada Tensions:
కెనడాపై ఫైర్..
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య భారత్, కెనడా మధ్య చిచ్చు రాజేసింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలపైనా ఇది ప్రభావం చూపించింది. కెనడా ప్రధాని ట్రూడో భారత్‌పై ఆరోపణలు చేయడం వల్ల ఈ మైత్రి ఇంకాస్త సన్నగిల్లింది. దీనిపై ఇప్పటికే భారత్ గట్టిగానే బదులిచ్చింది. అయితే...ఇప్పుడిప్పుడే తప్పు దిద్దుకునే పనిలో పడ్డారు ట్రూడో. భారత్‌తో మైత్రి తమకు ఎంతో అవసరమని వెల్లడించారు. ఈ వివాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌తో భేటీ అయ్యారు. భారత్-కెనడా మధ్య జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. నిజ్జర్ హత్య వెనక భారత్‌కి చెందిన ఏజెంట్స్ ఉన్నారన్న ట్రూడో ఆరోపణల్ని మరోసారి ఖండించారు జైశంకర్. కెనడా ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడమే కాకుండా...హింసను ప్రేరేపిస్తోందని మండి పడ్డారు. కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం కెనడా వాళ్లకు ఆశ్రయమిస్తోందని స్పష్టం చేశారు. నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందనడానికి కెనడా వద్ద ఎలాంటి ఆధారాల్లేవని తేల్చి చెప్పారు. కెనడాలో జరుగుతున్న హింసాకాండను "సాధారణమే" అని పరిగణించలేమని స్పష్టం చేశారు జైశంకర్. భారత రాయబార కార్యాలయాలపై దాడులు చేస్తూ...పరిస్థితులు అంతా సాధారణంగానే ఉన్నాయని కెనడా ఎలా చెబుతోందని మండి పడ్డారు. కెనడాలో జరుగుతున్న పరిణామాల్ని కచ్చితంగా ఖండించాలని అన్నారు.
"ఇవాళ కెనడాలో జరుగుతున్న హింసాకాండ గురించి అందరూ ఆలోచించాలి. రాయబార కార్యాలయాలపైనా స్మోక్ బాంబ్‌లు వేశారు. దారుణమైన విధ్వంసానికి పాల్పడ్డారు. కొంత మందిని కావాలనే టార్గెట్ చేసుకుని దాడులు చేశారు. ఇంత జరుగుతున్నా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఎలా అనుకుంటాం..? ఇదే విధ్వంసం వేరే ఏదైనా దేశంలో జరిగుంటే ఎలా రియాక్ట్ అయ్యేదో ఆలోచించాలిగా. కెనడాలో ఎన్నో సమస్యలున్నాయి. వాటన్నింటికన్నా ఉగ్రవాదం చాలా పెద్ద సమస్య. దానిపై అందరూ దృష్టి పెట్టాలి. వేర్పాటువాదాన్ని, హింసను ప్రేరేపిస్తున్నారు. కెనడాని అమెరికన్లు ఓ విధంగా చూస్తున్నారు. భారత్ మరో విధంగా చూస్తోంది. ఇక్కడే సమస్య వస్తోంది"
- ఎస్ జైశంకర్, భారత విదేశాంగ మంత్రి
తలుపులు మూసుకోలేదు..
భారత్‌పై కెనడా చేస్తున్న ఆరోపణల్ని ఖండించిన జైశంకర్...విచారణకు ఎప్పటికీ సహకరిస్తామని తేల్చి చెప్పారు. విచారణకు సహకరించకుండా తలుపులు మూసేసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. ఏ సమాచారం ఉన్నా అందించాలని ఇప్పటికే కెనడాకి చెప్పినట్టు స్పష్టం చేశారు.
"కెనడా చేసిన ఆరోపణలపై ఇప్పటికే నేను సమాధానం చెప్పాను. నిజ్జర్ హత్య విషయంలో భారత్ హస్తం ఉందనడానికి ఏమైనా ఆధారాలుంటే ఇవ్వాలని స్పష్టంగా చెప్పాను. మేమేం తలుపులు మూసుకుని కూర్చోలేదు. మా అవసరం ఉందని అనిపిస్తే కచ్చితంగా సహకరిస్తాం"
- ఎస్ జైశంకర్, భారత విదేశాంగ మంత్రి