సోషల్ మీడియా.. ఇప్పుడు నడిపించేదంతా అదే. ఏం జరిగినా.. తెలిసేదంతా ఆ వేదికపైనే.  ఈ కాలంలో చాలామంది జనాల సమస్యలకు పరిష్కారం అక్కడే దొరుకుతుంది. జనాలకు.. నేతలకు మధ్య సోషల్ మీడియా వారధి ఇప్పుడు. అలా కేటీఆర్ దగ్గరకు ఏవైనా ప్రజా సమస్యలపై ట్వీట్‌ వస్తే వెంటనే స్పందిస్తారు. అర్ధరాత్రైనా.. సరే... అధికారులను పరుగులు పెట్టిస్తారు. సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తారు. కేటీఆర్‌కు ఎవరైనా ట్వీట్ చేస్తే.. ఎలా స్పందించారో కొన్ని చూద్దాం..


జ‌న‌గామ జిల్లా లింగాల గణపురం మండలం సిరిపురం గ్రామానికి చెందిన కత్తుల సువర్ణ అనే మహిళా రైతు కొద్ది నెలల క్రితం మరణించింది‌. ఆమె పేరిట 4 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. రైతుబంధు పథకం పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా రూ.5 లక్షల రైతు భీమా పరిహారం కోసం మహిళా రైతు కుటుంబం దరఖాస్తు చేసుకుంది. వివిధ సాంకేతిక కారణాలు చూపి అధికారులు బీమా దరఖాస్తును తిరస్కరించారు. మృతురాలి కుమారుడు కత్తుల కౌశిక్ తమ సమస్యను మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ మెసేజ్ ద్వారా విన్న‌వించాడు. అర్ధరాత్రి జనగామ జిల్లా కలెక్టర్‌కు కేటీఆర్ మెసేజ్ చేసి.. సమస్యను పరిష్కరమయ్యేలా చేశారు.


సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం చాకలిగూడెంకు చెందిన సతీశ్​.. 8 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. మృతుడికి ముగ్గురు ఆడపిల్లలుండగా.. వారిని పోషించుకోలేని ఆ తల్లి దీనస్థితిని స్థానికులు ట్విట్టర్​లో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ట్వీట్​పై స్పందించిన మంత్రి.. వారికి సాయం చేయాల్సిందిగా కోరుతూ స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్​ను ట్యాగ్​ చేశారు. మంత్రి సూచనల మేరకు.. ఎమ్మెల్యే ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఇవే కాదు.. అనేక సమస్యలపైనా కేటీఆర్ వెంటనే స్పందించారు.


కౌంటర్ ట్వీట్లు ఉంటాయి...


కొంతమంది ఆకతాయిలు చేసే ట్వీట్లకు కేటీఆర్ కౌంటర్ ట్వీట్ కూడా ఇస్తారు. ఇటీవలే ఓ వ్యక్తి.. బిర్యాని ఆర్డర్ చేస్తే.. మసాలా, లెగ్‌పీస్ రాలేదంటూ.. కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ.. ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన మంత్రి.. అసలు నన్నేందుకు ట్యాగ్ చేశావ్ బ్రదర్? నా నుంచి ఏం ఆశిస్తున్నావంటూ.. స్పందించారు. ఈ మాటలతో ఆ యువకుడు తన ట్వీట్‌ను డిలిట్ చేసేశాడు. ఇలా చాలా ట్వీట్లే ఉన్నాయి.


అంతేకాదు.. ఆస్క్ కేటీఆర్ పేరుతో సోషల్ మీడియాలో అడిగే ప్రశ్నలకు జవాబులు ఇస్తారు కేటీఆర్. Ask me#తో ట్విట్టర్‌లో కేటీఆర్ నిర్వహించే కార్యక్రమంలో చాలామంది పాల్గొని ప్రశ్నలు అడుగుతారు. ఓపికతో వాటికి కేటీఆర్ సమాధానాలిస్తారు. సమస్య పరిష్కారంపై అధికారులతోనూ మాట్లాడతారు.