ఆ దంపతులకు సమస్య వచ్చింది.. ఎవరితోనైనా చెప్పుకుంటే సలహా ఇచ్చేవారేమో.. కానీ వారిద్దరూ గూగుల్‌ని నమ్ముకున్నారు. అప్పులు తీర్చాలని చేసిన ప్రయత్నాల్లో ఇంకా అప్పుల్లోకి వెళ్లిపోయారు.
అప్పులు తీర్చేందుకు కిడ్నీలు అమ్ముకోవాలని భావించారు ఆ దంపతులు. వాటిని కోనేవారి కోసం ఆన్‌లైన్‌లో అన్వేషించారు. అలా సైబర్ మోసగాళ్లు మాయమాటలు చెప్పి వారి దగ్గర రూ.40.38 లక్షల వరకు కాజేశారు. ఈ ఘటనపై బాధితులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉండే మోది వెంకటేశ్, లావణ్య దంపతులు స్టేషనరీ, బ్యాంగిల్ స్టోర్ నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం సొంతింటి నిర్మాణం మెుదలుపెట్టారు. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ద్వారా రూ.౩4లక్షలు, తర్వాత మరో రూ.10 లక్షలు రుణం తీసుకున్నారు. నాలుగంతస్తుల ఇల్లు అయ్యేసరికి రూ.1.50 కోట్ల అప్పులయ్యాయి. కరోనా లాక్‌డౌన్‌తో వ్యాపారం మూతపడింది. మరోవైపు అప్పులిచ్చినవారి నుంచి ఒత్తిడి. ఎలాగైనా డబ్బులు తిరిగివ్వాలని.. తమ వాళ్లు సాయం చేసిన వారు ఇబ్బందులు పడొదనుకున్నారు. కిడ్నీలు అమ్ముకోవడానికి నిర్ణయించుకున్నారు.
ఎలాగైనా కిడ్నీలు అమ్మాలని.. గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి పరిచయమై.. రిజిస్ట్ట్రేషన్ ఫీజు కడితే చాలు అని చెప్పాడు. ఆ తర్వాత కిడ్నీకి బీమా, కరెన్సీ ఎక్స్ఛేంజ్‌ల కోసమంటూ మెుత్తం రూ.10 లక్షల వరకు కట్టించుకున్నాడు. ఇలా మెుత్తం నలుగురిని ఆన్‌లైన్‌లో సంప్రదించారు ఆ దంపతులు. ఓ వ్యక్తి కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు కడితే రావాల్సిన మెుత్తంలో సగం ఖాతాలో వేస్తానని నమ్మించాడు. చెప్పినట్లే రెండు ఖాతాల్లో డబ్బులు జమైనట్లు కనిపించాయి. రెండు, మూడు రోజుల్లో ఆ డబ్బులు తీసుకోవచ్చని చెప్పాడు. విత్‌డ్రా చేద్దామంటే.. రాలేదు. అతడిని మళ్లీ సంప్రదించగా.. ఏవేవో సర్టిఫికెట్లు కావాలంటూ.. డబ్బులు కట్టించుకున్నాడని దంపతులు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరో వ్యక్తి డబ్బులు తీసుకునేందుకు బెంగళూరుకు వస్తే.. తమ మనుషులు అడ్వాన్స్ చెల్లిస్తారని చెప్పాడు. అది నేజమేనని నమ్మి వారు అక్కడికి వెళ్లారు. ఇద్దరు వ్యక్తులు హోటల్‌కు వచ్చారు. లాకర్ తెరిచి.. డబ్బులు చూపించారు. నోట్లు నలుపు రంగులో ఎందుకు ఉన్నాయని ప్రశ్నించగా.. ఆర్‌బీఐ డబ్బు అని, రసాయనాలతో శుభ్రం చేయాల్సి ఉంటుందని చెప్పారు. కొన్నింటిని శుభ్రం చేసి చూపించారు. వాటని ఓ ప్యాకెట్‌లో కట్టి ఇచ్చి.. 48 గంటల వరకు తెరవకూడదన్నారు. ముంబయి నుంచి రసాయనాలు తెప్పించాలంటూ వారు డబ్బులు కట్టించుకున్నారు. దీనికోసం ఆ దంపతులు తెలిసినవారి దగ్గర బంగారాన్ని తాకట్టు పెట్టారు. తీరా హైదరాబాద్‌కు వచ్చాక ప్యాకెట్ తెరిచిచూస్తే.. అవన్నీ దొంగనోట్లని తెలిసిందని దంపతులు చెబుతున్నారు.