KTR Tweet :   ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోయారని పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు గురువారం ఒక్క సారిగా సైలెంట్ అయిపోయారు. ఒక్క లీడర్ కూడా ఈ అంశంపై మాట్లాడలేదు. దీనికి తగ్గట్లుగానే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..  ఫామ్ హౌస్ కేసు విషయంలో ప్రాథమిక విచారణ జరుగుతోందని..  ఎవరూ మాట్లాడవద్దని సూచిస్తూ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. 


 





 


ఫామ్ హౌస్ కేసు విషయంలో  ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నించిందంటూ.. టీఆర్ఎస్ నేతలు బుధవారం ఆర్థరాత్రి కూడా ధర్నాలు చేశారు. గురువారం బీజేపీ నేతలు ఈ ఫామ్ హౌస్ కేసుపై ప్రెస్ మీట్ పెట్టి రెండు, మూడు గంటలు తమ వాదన వినిపించారు.  కానీ టీఆర్ఎస్ నేతలు మాత్రం సాయంత్రం వరకూ బయటకు రాలేదు. కేసీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియా ముందుకు వస్తారని.. బుధవారం సాయంత్రం నుంచి టీఆర్ఎస్ వర్గాలు చెబుతూ వస్తున్నాయి.  కానీ గురువారం సాయంత్రానికీ అలాంటి సూచనలేమీ కనిపించ లేదు. పైగా కేటీఆర్ ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో  ఇక టీఆర్ఎస్ వైపు నుంచి ఈ కేసు విషయంలో ఎలాంటి స్పందన ఉండదని తేలిపోయింది. 



డీల్‌లో ఉన్న ఎమ్మెల్యేలు హర్షవర్థన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేగ కాంతారావు  ఫామ్ హౌస్ నుంచి నేరుగా ప్రగతి  భవన్‌కు వచ్చారు. మళ్లీ బయటకు వెళ్లారో లేదో తెలియదు.  బీజేపీ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇవ్వలేదు. అయితే  పోలీసులు మాత్రం... మొత్తం రూ. 250 కోట్ల డీల్ జరగబోయిందని ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కానీ స్పాట్‌లో ఎంత క్యాష్ పట్టుకున్నారో చెప్పలేదు. అసలు పట్టుకున్నారో లేదో స్పష్టత లేదు. ఈ వ్యవహారం అంతా  గందరగోళంగా మారింది. మరో వైపు ఈ కేసులో  ఏసీబీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. బీజేపీ నేతుల వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ లేద సిట్‌తో దర్యాప్తు చేయించాలన్నారు. 


తనను బీజేపీ నేతలు ప్రలోభపరిచారని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీతో సంబంధాలున్న సతీశ్ శర్మ, నంద కుమార్ అనే వ్యక్తులు టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే రూ.100 కోట్లు, సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ కాంట్రాక్టులతో పాటు కేంద్రంలో లాభదాయక పదవులు ఇస్తామని తనను ప్రలోభపెట్టారని రోహిత్ రెడ్డి కంప్లైంట్ లో పేర్కొన్నారు.  ఒకవేళ తాను బీజేపీలో చేరని పక్షంలో ఈడీ, సీబీఐ దాడులు, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సైతం కూలదోస్తామని హెచ్చరించినట్లు రోహిత్ రెడ్డి కంప్లైంట్లో ప్రస్తావించారు. అయితే ఆ సతీష్ శర్మ.. నందకుమార్‌లకు బీజేపీతో సంబంధాలున్నాయని నిరూపించే సాక్ష్యాలు లేవు. వారు బీజేపీ నేతలతో దిగిన ఫోటోలు మాత్రమే ఉన్నాయి. నందకుమార్ టీఆర్ఎస్ నేతలతోనూ సన్నిహితంగా ఉంటారు. ఆ ఫోటోలూ వైరల్ అయ్యాయి.  


కారణం ఏదైనా ..  హై పొలిటికల్ టెన్షన్ ఉంటుందని భావించిన ఈ కేసులో టీఆర్ఎస్ ఒక్క సారిగా సైలెంట్ అయిపోవడం.. తమ పార్టీ నేతల్ని కూడా నోరు తెరవవద్దని చెప్పడంతో ఏం తెర వెనుక ఏం జరుగుతోందన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.