KTR Comments: తెలంగాణలో ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇకనైనా పాలనపై ఫోకస్ చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం సందర్భంగా నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవంలో కేటీఆర్ జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో పారిశుధ్యం పడకేసిందని అన్నారు. జనం చికెన్ గున్యాలు, విష జ్వరాలు, డెంగీతో బాధపడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించే పరిస్థితి ఉందని మొత్తం పాలన పక్కన పెట్టి.. కేసీఆర్, బీఆర్ఎస్‌ను దూషించటమే పనిగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నారని అన్నారు. రేవంత్, నీకు చేతనైతే మీరు ఇచ్చిన 420 అడ్డగోలు హామీలను అమలు చేసి చూపించండని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట నెలకొల్పడాన్ని కూడా కేటీఆర్ మరోసారి తప్పుబట్టారు. తాము అధికారంలోకి రాగానే కచ్చితంగా సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేసి గాంధీ భవన్‌కు తరలిస్తామని తేల్చి చెప్పారు. రాజీవ్ గాంధీ అంటే రేవంత్ రెడ్డికి అంత ఇష్టంగా ఉంటే జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకోవాలని కేటీఆర్ మాట్లాడారు.
రాజీవ్ గాంధీ బతికి ఉన్నా ఈ దుర్మార్గాన్ని సహించేవారు కాదేమో - నిరంజన్ రెడ్డి
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు వనపర్తి జిల్లా గోపాల్ పేటలో జమ్మి చెట్టు చౌరస్తా నుంచి భారీ సంఖ్యలో నాయకులతో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహాన్నికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నిజాం ప్రభుత్వం భారత యూనియన్ నందు విలీనము తర్వాత స్వయం ప్రతిపత్తి కలిగిన హైదరాబాద్ రాష్ట్రాన్ని నెహ్రూ ప్రభుత్వం కుట్రతో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలిపి సమైక్య రాష్ట్రం చేయడంతో ఆనాటి నుండి స్వరాష్ట్ర కాంక్ష కొరకు ప్రజలు ఉద్యమించారని అన్నారు. 1969 ప్రారంభమైన ఉద్యమం 1972 వరకు పోరాటం చేసి 369 మంది అమరులయ్యారని గుర్తు చేశారు.
30 ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ప్రజలు అన్ని విధాలుగా నష్టపోతున్న తరుణంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఉద్యమం ప్రభంజనమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, అమలు కాని 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 10 నెలల కాలంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా విధ్వంసం చేశారని ఆరోపించారు. ఉచిత బస్సు తప్ప ఒక్క గ్యారంటీ అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టే పరిస్థితి దాపురించింది అని ఆరోపించారు. కేవలం డిల్లీ నాయకులను సంతృప్తి పరచడానికి తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం, ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించిన స్థలములో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పట్ల తమకు అపారమైన గౌరవం ఉందని దేశం కోసం ఉగ్రవాదుల దాడిలో మరణించిన మాకు సానుభూతి ఉన్నదని అన్నారు. రాజీవ్ గాంధీ మీద అంత ప్రేమ ఉంటే 30ఏండ్లుగా గాంధీ భవన్ నందు విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని సమాధానం చెప్పాలి అని అన్నారు. అంబేద్కర్ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఇష్టం లేకనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆవిష్కరణకు రాలేదని అన్నారు. అంబేద్కర్ సచివాలయం, అమర వీరుల స్థూపం మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని గత కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించిందని ఎన్నికలు రావడంతో సాధ్యం కాలేదని ఇలాంటి స్థలంలో ప్రజల మనోభావాలను గౌరవిస్తూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే సముచితంగా ఉండేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని సగౌరవంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలించి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.