KTR makes controversial comments on the defection of MLAs:   పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.  ముఖ్యంగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. 75 ఏళ్ల వయసులో, గతంలో స్పీకర్‌గా, మంత్రిగా అన్ని గౌరవ పదవులనూ అనుభవించిన వ్యక్తి.. ఇలాంటి వయసులో కాంగ్రెస్  లో చేరడం  సిగ్గుచేటని మండిపడ్డారు. కేసీఆర్ ఆయనకు ఇవ్వని పదవి లేదని, కానీ నేడు గౌరవం పోగొట్టుకుని కాంగ్రెస్ బెంచీల్లో కూర్చోవడం ఆయన పతనానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు.

Continues below advertisement

అసెంబ్లీలో పోచారం ప్రవర్తనను కేటీఆర్ ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అయి ఉండి కాంగ్రెస్ పక్షాన ఎందుకు కూర్చున్నారని మా సభ్యులు ప్రశ్నిస్తే, బాత్రూమ్ దగ్గరగా ఉందని అందుకే ఇక్కడ కూర్చున్నానని సమాధానం ఇవ్వడం అత్యంత దౌర్భాగ్యం" అని పేర్కొన్నారు. ఇలాంటి అగౌరవకరమైన జీవితం గడపడం కంటే మరణించడం మేలంటూ ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పక్షాన చేరి పోచారం తన ఇన్నేళ్ల మంచి పేరును స్వయంగా మంట గలుపుకున్నారని అన్నారు.             

అలాగే పార్టీ మారిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల తీరును కూడా కేటీఆర్ తీవ్రంగా  మండిపడ్డారు.  వారు తాము ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని, కనీసం తాము ఏ పక్షమో  మగవారో, ఆడవారో అన్నంత స్పష్టత లేనట్లుగా చెప్పుకోలేక పోతున్నారని ఘాటుగా విమర్శించారు. ఇలాంటి సిద్ధాంతం లేని రాజకీయం సమాజానికి చెడు సంకేతాలు పంపిస్తుందని, ప్రజలు వీరిని అసహ్యించుకుంటున్నారని కేటీఆర్  విమర్శించారు.                                            

సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి తీరుపై కూడా కేటీఆర్ మండిపడ్డారు. తనకు నచ్చిన పార్టీలో ఉంటానంటూ కడియం చేస్తున్న వ్యాఖ్యలు వింటుంటే.. అలా మాట్లాడే వారిని కొట్టాలనిపిస్తుందని ఆవేశంగా వ్యాఖ్యానించారు. అధికార దాహం కోసం పార్టీలు మారే సంస్కృతిని తెలంగాణ ప్రజలు సహించరని, నైతిక విలువలు లేని ఇలాంటి నాయకులకు భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెబుతారని కేటీఆర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.