హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ గెలిచేంత వరకు ఒకమాట మాట్లాడి, గెలిచాక ఇంకో మాట మాట్లాడుతోందని.. బీజేపీకి, కాంగ్రెస్ కు తేడా ఏంటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ చెప్పిందొకటి, చేసేది మరొకటని, కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు కేటీఆర్. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పగా.. తాజాగా ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు (Tellam Venkatrao) బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో ఆదివారం హస్తం గూటికి చేరారు. బీఆర్ఎస్ పార్టీ నేతల్ని కాంగ్రెస్ లాక్కోవడంపై కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.




మేనిఫెస్టోలో చెప్పేదొకటి, చేసేది మరొకటి..
కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాజ్యాంగ పరిరక్షణ అనే చాప్టర్ 13 వ పాయింట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక పార్టీ లో గెలిచి ఇంకో పార్టే కి వెళితే వెంటనే disqualify అయ్యే లా చట్ట సవరణ చేస్తాం అని చెప్పారు. కానీ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంతో పాటు ఏకంగా కాంగ్రెస్ ఎంపీ టికెట్ కేటాయించిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. 






సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ, హస్తం పార్టీలలో చేరిపోయారు.  తాజాగా భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గులాబీ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో ఆదివారం హస్తం పార్టీలో చేరిపోయారు. వెంకట్రావుతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.


ఎమ్మెల్యేగా గెలుపొందిన కొన్ని రోజులకే తెల్లం వెంకట్రావ్ హైదరాబాద్ వచ్చి సీఎం రేవంత్, మంత్రి పొంగులేటిని కలవడం తెలిసిందే. అయితే మర్యాదపూర్వకంగా భేటీ అయ్యానని, పార్టీ మారడం లేదని వెంకట్రావ్ అప్పట్లో చెప్పారు. తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ శనివారం నిర్వహించిన జన జాతర సభకు సైతం తెల్లం వెంకట్రావ్ హాజరయ్యారు. రాహుల్ గాంధీ పాల్గొని కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన ఈ సభలో వేదికపై ఎమ్మెల్యే వెంకట్రావ్ కనిపించడంతో ఆయన పార్టీ మారడం ఖాయమని అంతా అనుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావ్ చేరారు.