KTR : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను తక్షణమే రద్దు చేస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రైతు జేఏసీ బృందం శనివారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశం అయింది. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటికే రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్‌ని రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ ప్రకటించిందన్నారు. మరోసారి డీటీసీపీ అధికారులతో మాట్లాడిన కేటీఆర్.. ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రద్దుకు సంబంధించి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిందన్నారు.
మాస్టర్ ప్లాన్ రద్దు ఉద్యమం నాటి కేసులు ఎత్తి వేస్తామని భరోసా
రైతు జేఏసీ నిరసన కార్యక్రమాల సందర్భంగా నమోదైన కేసులను కూడా సానుకూలంగా పరిశీలించి ఎత్తేసే చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా ఎస్పీ నుంచి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర డీజీపీతో మాట్లాడారు.ఈ ఏడాది జనవరిలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. రైతుల ఉద్యమానికి రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. భూములు పోతాయన్న ఆందోళనతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. మరో రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇటీవల జిల్లా కేంద్రంలో రైతుల భారీ ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా, జిల్లా కేంద్రం బంద్ పోగ్రాములు సక్సెస్ అయ్యాయి. దీంతో రైతుల ఉద్యమం రాష్ర్ట వ్యాప్తంగా చర్చగా మారింది.
వివాదాస్పద మాస్టర్ ప్లాన్‌కు గతంలో ముసాయిదా రెడీ
కామారెడ్డి పట్టణానికి మున్సిపల్ అధికారులు ఓ మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపొందించారు. దానిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. అయితే ఈ మాస్టర్ ప్లాన్ కారణంగా భూములు పోతున్నాయన్న ఆందోళనతో 8 గ్రామాల రైతులు ఉద్యమం ప్రారంభించారు. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌ను 2022 నవంబర్ చివరిలో ప్రకటించారు. ఇందులో చూపెట్టిన ఇండస్ర్టియల్ జోన్, గ్రీన్ జోన్, రీక్రియేషన్ జోన్, 100 ఫీట్లు, 80 ఫీట్ల రోడ్ల ప్రతిపాదనలపై ఆయా గ్రామాలకు చెందిన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కామారెడ్డి మున్సిపాల్టీ పరిధిలోని అడ్లూర్, ఇల్చిపూర్, టెకిర్యాల్, లింగాపూర్, పాతరాజంపేట, రామేశ్వర్పల్లిలో పాటు సదాశివనగర్ మండలం అడ్లూర్ఎల్లారెడ్డికి చెందిన రైతులంతా రైతు ఐక్య కార్యచరణ కమిటీగా ఏర్పడ్డారు. మున్సిపాల్టీలో విలీనమైన లింగాపూర్, టెకిర్యాల్, అడ్లూర్, రామేశ్వర్‌పల్లి, ఇల్చిపూర్, పాతరాజంపేట గ్రామాలతో పాటు, సదాశివనగర్ లో బీఆర్ఎస్ కు పట్టుంది. కానీ, మాస్టర్ ప్లాన్‌పై ఈ గ్రామాల నుంచే వ్యతిరేకత వచ్చింది.
కేసీఆర్ పోటీ చేస్తూండటంతో కీలక నిర్ణయం
కామారెడ్డి నుంచి కూడా ఈ సారి కేసీఆర్ పోటీ చేస్తున్నారు. దీంతో అక్కడ ప్రజల్లో ఉన్న అసంతృప్తికి సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకుని సమస్యలు పరిష్కరించాలనుకున్నారు. అందుకే వెంటనే.. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం పోరాడిన జేఏసీని పిలిపించి మాట్లాడి.. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లుగా చెప్పారు.