KTR announced that they are ready for the by election: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు పడుతుందని.. తాము ఉపఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.  కాంగ్రెస్‌ ఫిరాయింపుదారులను ఇకపై రక్షించడం అసాధ్యమని ఆయన ట్వీట్ చేశారు.  


పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడంతో ఈ విధంగా స్పందించారు.  గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,  ప్రకాష్ గౌడ్,  డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత రెండో పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగిది.  పార్టీ ఫిరాయించిన ఏడుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని సుప్రీంకోర్టులో  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటి,న్ వేశారు.  కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని హరీష్ రావు  వేసిన మొదటి పిటిషన్‌తో పాటు రెండో పిటిషన్‌ను విచారిస్తామని  సుప్రీంకోర్టు తెలిపింది.  
ఫిబ్రవరి 10న మొదటి పిటిషన్ విచారణ జరిగే రోజే రెండో పిటిషన్‌పై విచారిస్తామని తెలిపింది. 


2023అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో 10 మంది కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద వారిని అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో  చర్యలు తీసుకోవాలని  స్పీకర్‌ను ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. సింగిల్ జడ్జి తీర్పుపై శాసనసభ కార్యదర్శి హైకోర్టు ప్రత్యేక బెంచ్‌ను ఆశ్రయించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పుడైనా చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉందని, దీనికి కాలపరిమితి లేదని ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే, స్పీకర్ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ హైకమాండ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.                     


రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించి కూడా ఆరు నెలలు గడిచినా స్పీకర్ ఇంకా ఎటువంటి చర్య తీసుకోలేదని పిటిషనర్ ఎత్తి చూపారు. కనీసం వాళ్లు నోటీసు కూడా ఇవ్వలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేశం మేఘ చంద్ర కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయాలని బిఆర్‌ఎస్ పార్టీ కోరుతోంది.  ఎమ్మెల్యేలపై ఆయా పార్టీలు దాఖలు చేసిన ఫిర్యాదులపై స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం ప్రకటించాలని కేశం మేఘ చంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని బిఆర్‌ఎస్ తెలిపింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తదుపరి విచారణలో కీలక నిర్ణయాలను సుప్రీంకోర్టు తీసుకునే అవకాశం ఉంది. 



Also Read: Telangana Caste Survey: తెలంగాణలో ఏ సామాజిక వర్గం వారు ఎంత శాతం ఉన్నారు? లెక్కలు తేల్చిన ప్రభుత్వం, రేపు అసెంబ్లీకి సర్వే నివేదిక